
నరుడికి నాగరికత నేర్పిండి నేతన్నలే అని మంత్రి సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చేనేత వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మనిషి వస్త్రాన్ని నేయడం, ధరించడం ప్రారంభించినప్పుడే నాగరిక సమాజానికి నాంది పడిందని తెలిపారు. నేతన్న నూలుపోగు మన నాగరికతకు చిహ్నమని, చేనేత కేవలం ఒక వృత్తి కాదని, అది మన సంస్కృతికి ప్రతీక, సంప్రదాయానికి చిరునామా అని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని కేవలం సంక్షేమ కోణంలో కాకుండా ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోణంలో ప్రభుత్వం చూస్తోందన్నారు. నేతన్నల కష్టం వృథా కాకుండా నిరంతర ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విలువైన ఇందిరమ్మ చీరల ఆర్డర్లను చేనేత కార్మికులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో వేలాది నేత కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లకు అవసరమైన వస్త్రాన్ని కూడా చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా చేనేత రంగానికి బలమైన మార్కెట్ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, టెస్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.








