హైదరాబాద్: పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ ను ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 2న బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తిరుచ్చి వెళ్లారని, దేని కోసం వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ హరీశ్ రావు వెళ్లిన ఫోటోలు బయటకు రాలేదని విమర్శించారు. ఎల్ నినో ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు చూస్తున్నామని, మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ఎల్ నినో ప్రభావం కనిపించిందని.. అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, తాము ఏం మాట్లాడిన కాంగ్రెస్ గురించి తప్పుగా అంటున్నారని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో బిఆర్ఎస్ కు 39 సీట్లు ఇచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు సున్నా మెజారిటీ ఇచ్చారని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఎన్ని పూజలు చేసినా ఏం ఫలితం ఉండదని, క్షుద్రపూజలు చేయడం బిఆర్ఎస్ కు అలవాటేనని దుయ్యబట్టారు.  ఊళ్లల్లో మంత్రాలు, తంత్రాలు ఉన్నాయని, ప్రజలే దేవుళ్లు..క్షుద్రపూజలు నడవవు అని సూచించారు. క్షుద్ర పూజల్ని ప్రజలు హర్షించరని, ప్రజలు కష్టపడాలని కోరుకోవడం మంచిది కాదని మహేష్ కుమార్ గౌడ్  హెచ్చరించారు. హరీష్ రావు కూడా అలాంటి క్షుద్ర పూజలే చేశారని ప్రజలే అంటున్నారని, హరీష్ రావు ఆ తేదీల్లో ఎక్కడున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తమర్ని క్షమించమని బిఆర్ఎస్ అడగాలని, తెలంగాణకు పదేళ్లు బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, ప్రతిపక్ష హోదా వచ్చిన బిఆర్ఎస్ ఏం చేయటం లేదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. తాము మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.