నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు కార్చిచ్చులా చెలరేగిన తరువాత కేంద్ర ప్రభుత్వం మత్తు నిద్రనుంచి మేల్కొని రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రక్షాళనకు నిపుణుల కమిటీని నియమించింది. లీకేజీని అరికట్టే చటాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. దేశంలో అత్యున్నత విద్యాసంస్థల అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించే బాధ్యత ఎన్‌టిఎదే. కానీ ఎన్‌టిఎ లోపాలమయం. సరైన పునాది లేని, సరిగ్గా పనిచేయని వ్యవస్థ. వ్యవస్థ మూలాలను సరిదిద్దకుండా కేవలం అప్పటికప్పుడు వచ్చే సమస్యలను సరిష్కరించడమే పనిగా ప్రభుత్వం గడుపుతోంది. 2024లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన తరువాత డాక్టర్ కె. రాధాక్రిష్ణన్ కమిటీ ఎన్‌టిఎ పనితీరు లోపాలను గుర్తించి 101 సూచనలతో నివేదిక వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం ఎన్‌టిఎలో సంస్కరణలు జరిగితే ఇప్పుడు నీట్ పరీక్ష లీకేజీకి అవకాశమే ఉండేది కాదు.

కానీ ఆ నివేదికను కేవలం కాగితాలకే ప్రభుత్వం పరిమితం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వ్యవస్తే. డైరెక్టర్ జనరల్, ఇద్దరు అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ ఆధ్వర్యంలో 10 క్రియాశీల విభాగాలు పనిచేస్తున్నాయి. ఇది సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ఫోరెన్సిక్, వెయ్యి ప్రామాణిక పరీక్ష కేంద్రాలు, పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల గుర్తింపు నిర్ధారణకు, ముఖగుర్తింపు, వేలిముద్రల పరిశీలను, ఆధార్ ధ్రువీకరణ, తదితర ప్రక్రియలతో కూడిన బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ భద్రతా వ్యవస్థ. ఇన్ని హంగులున్నా వ్యవస్థాపరమైన సవాళ్లు అలాగే ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినా 6 నుంచి 12 నెలల కాలమే పనిచేసే రిక్రూట్‌మెంట్స్, మొక్కుబడి వేతనాలు, ఇవన్నీ చూస్తే ప్రైవేట్ రంగంతో పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగాల నియామకానికి శాసనసభ లేదా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.

ఎన్‌టిఎలో శాశ్వత ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించడం లేదు. కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడుతున్నారు. డేటా అనాలిసిస్, ఇతర కీలకమైన పనులన్నీ అవుట్‌సోర్స్‌లోనే జరుగుతున్నాయి. రోజువారీ వ్యవహారాలను డిప్యుటేషన్ సిబ్బందే చూస్తున్నారు. దీనికి తోడు నీట్ 2027 వరకే గడువు విధించడం ఆందోళన కలిగించే అంశం. రాధాక్రిష్ణన్ ప్యానెల్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయవలసి వస్తే ఇప్పుడున్న వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు తగినట్టు అత్యంత ఆధునిక విధానాల వైపు సంస్కరించక తప్పదు. అమెరికాలో ఎంఎస్ లేదా పిహెచ్‌డి ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ (జిఆర్‌ఇ) వంటి ప్రామాణిక ప్రవేశ పరీక్ష కీలక పాత్ర వహిస్తోంది. ఎన్‌టిఎ విషయంలో అలాంటి విధానమే ఉండాలని రాధాక్రిష్ణన్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటి. పరీక్షల యంత్రాంగంలో నేషనల్ మెడికల్ కమిషన్, ఐఐటిలను క్రియాశీలకంగా కాకుండా కేవలం ప్రేక్షకులుగా చూడడాన్ని ప్యానెల్ గుర్తించింది. అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, మూల్యాంకన పరిశోధకులు, ఇప్పుడు నీట్ పరీక్ష నిర్వహణ లోపాలపై సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఈ పరీక్షలు దేనిని అంచనా వేయడానికి ఉద్దేశించబడ్డాయి? ప్రస్తుత అవసరాలకు తగినట్టు ఉన్నాయా? అన్న అనుమానాలు లేవదీస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సమస్య పరిష్కారమైపోయినట్టు వ్యవహరిస్తోంది. పాతుకుపోయిన లోపాలను సరిదిద్దడానికి బదులు కేవలం పైపైన కనిపించే సాంకేతిక సమస్యగా మాత్రమే చూసి సరిచేయాలనుకుంటోంది. జెఇఇ పరీక్ష సక్రమంగా నిర్వహిస్తుండడానికి ఐఐటి అధ్యాపకులే ప్రధాన కారణం. ఐఐటికి మంచిపేరు, పవిత్రత తమ సొంత బ్రాండ్‌తో ముడిపడి ఉన్నాయని భావిస్తుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేసే వారికి ఐఐటి అధ్యాపకుల వలే పరీక్ష వ్యవస్థ పట్ల, బ్రాండ్ విలువపట్ల ఎలాంటి ప్రత్యేక నిబద్ధత, బాధ్యత లేదు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లా కాకుండా నీట్ ప్రశ్నపత్రాలను వివిధ ప్రశ్నపత్రాల నిల్వల (క్వశ్చన్ బ్యాంక్స్) నుండి కంప్యూటర్ ప్రోగ్రాముల సాయంతో తయారు చేస్తున్నారు.

మొన్న నీట్ పరీక్షల లీకేజీలో పేపర్ తయారు చేసిన వారే ప్రధాన నిందితులు కావడం గమనార్హం. దీనికి తోడు కోచింగ్ తరగతుల కేంద్రాలతో లావాదేవీలు మోసాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే విశ్వవిద్యాలయాలు లేదా విద్యావేత్తలతో ఎక్కువ సంబంధాలు నెరపుతున్నట్టు లేదు. అందుకనే పరిశోధకులు, విద్యావేత్తలు ఈ విషయంలో కలిసిరావడం లేదు. ప్రధాని మోడీ ప్రకటించిన దాని బట్టి టాస్క్‌ఫోర్స్ లక్షం కేవలం నీట్ పరీక్షలనే కాదు, మొత్తం పరీక్షలన్నిటినీ నిర్వహించేలా బాధ్యతలు చేపట్టడమే. అలాంటప్పుడు సిబిఎస్‌ఇ మార్కింగ్ వైఫల్యం లాంటి పెద్ద గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది.

స్వయం ప్రతిపత్తితో పనిచేయగల ఉన్నత నాణ్యతగల విద్యాసంస్థలను నిర్మించలేకపోవడం సమస్య. ఈ సమస్యలను పరిష్కరించడానికి లేదా చర్చించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కాలేదన్నది తెలుసుకోవాలి. దేశంలో అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే సంస్థలు లేవని కాదు. ఐఐటిలు తమ ప్రవేశ పరీక్షలను అనేక దశాబ్దాలుగా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నిర్వహించగలుగుతున్నారు. అలాగే యూనియన్ పబ్లిక్ సరీస్ కమిషన్ పరీక్షలకు ఏటా 35 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నా ఎలాంటి అక్రమాలు జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వీలైనంత త్వరగా రాధాక్రిష్ణన్ కమిటీ సిఫార్సులకు విలువ ఇచ్చి ఎన్‌టిఎ వ్యవస్థాపక సమగ్రతను కాపాడాలి. మనకు కమిటీలు, చట్టాలకు లోటు లేదు. మార్పులు చేసే దృఢ సంకల్పం అవసరం. ఆ విధంగా ప్రభుత్వం సంస్కరణల అమలులో తన సమర్థత నిరూపించుకోవాలి.