
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డికి ఆరు వారాల గడువు కోరారు. ఈ మేరకు శనివారం ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి లేఖ రాశారు. శనివారం(సెప్టెంబర్ 5)లోగా సమాధానం ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. అయితే, ఆగస్టు 31న తనకు నోటీసు అందిందని, ఎథిక్స్ కమిటీ ఇచ్చిన మెటీరియల్ వాల్యూమ్ ఎక్కువగా ఉందని, పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరణ ఇస్తానని కౌశిక్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సమయం అవసరమని అన్నారు. మార్చి 29 ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ పూర్తిగా లేదని, ఆ రోజు అసెంబ్లీ మొత్తం ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడియో ఇవ్వాలని కోరారు. పూర్తి వీడియోను పరిశీలించి వివరంగా సమాధానం ఇస్తానని తెలిపారు. ఆరు వారాలు లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు తాను వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని ఎథిక్స్ కమిటీని కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు.











