
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంపై రుద్దుతోందని కెటిఆర్ ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకెళ్తే, వాటిని రేవంత్‌రెడ్డి రద్దు చేశారని విమర్శించారు.
అప్పట్లో మెట్రో విస్తరణకు అభ్యంతరం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందో, మెట్రోను టేకోవర్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక చిన్న పట్టణాలకు మెట్రోలను మంజూరు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ మెట్రో విస్తరణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా అన్యాయమే అని పేర్కొన్నారు.











