
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు తెలంగాణ సిఎంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులు పునః సమీక్షించాలని, రద్దు చేయాలని.. జిఆర్ఎమ్ బి అజెండాలో మొదటి సారి వచ్చిందని, మన ప్రాజెక్టులను ఎపి ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకించినా తెలంగాణ తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల మీద సోయిలేదని, ఇప్పటి కైనా జిఆర్ఎమ్ బి మీటింగ్ అజెండాను మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని హరీష్ రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిఆర్ఎమ్ బి మీటింగ్ ను బహిష్కరించాలని, అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయాలని సూచించారు. రివ్యూ చేయాలని..మీటింగ్ అజెండాగా ఉండడం జిఆర్ఎమ్ బి చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. నీటివాటాను కాపాడడంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ సాధించిన 360 టిఎంసిల నీటి హక్కులను కాలరాస్తే ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.








