హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ప్రభుత్వానికి రాలేదని ఆరోపణలు వస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 2023 నుంచి మిల్లర్లకు ధాన్యం- వచ్చిన బియ్యం మధ్య తేడా ఉందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికు రామచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. రూ.500 కోట్ల ధాన్యం వ్యహారంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం అందిందని, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందని సమాచారం ఉందని రామచందర్ రావు తెలియజేశారు. రైతుల ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు జరపాలని సూచించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ధాన్యం కోనుగోలు, రవాణా, నిల్వ, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థల్లో పర్యవేక్షణ ఉండాలని కోరారు. భవిష్యత్తులో ఘటనలు పునరావృత్తం కాకుండా సంస్కరణలు చేపట్టాలని, ప్రజాధనం, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని రామచందర్ రావు కోరారు.