మన తెలంగాణ/వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహంలో ఆదివారం రాత్రి నుంచి వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విద్యార్థినిలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరన్ తెలిపారు.

చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ జడ్పీసీఈవో రాంరెడ్డి, డీటీడీఓ నారాయణరెడ్డి, వర్ధన్నపేట తహశీల్దార్ విజయసాగర్ సందర్శించి బాలికల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్యసేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన వసతిగృహాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్ హాల్‌ను, కూరగాయలను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలికల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.