
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరినా, కోరకపోయినా గ్లోబరీనా సంస్థ అక్రమాల గుట్టు విప్పుతామని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ హెచ్చరించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. 20కి పైగా విద్యార్థుల ప్రాణాలు పోవడానికి గ్లోబరినా సంస్థ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరినా సంస్థ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గ్లోబరినా సంస్థ ఇప్పుడు పేరు మా ర్చుకొని విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడుతోందని ఆయన విమర్శించారు. గ్లోబరినాలో కెటిఆర్ ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ హయాంలో లీకుల పర్వం సాగిందని ఆయన దుయ్యబట్టారు. పద్నాలుగు వందల కోట్లు బిఆర్‌ఎస్ ఖాతాలో మూలుగుతున్నందున అందులో నుంచి చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా కెటిఆర్‌కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అయితే కెటిఆర్ కనీసం పుట్టిన రోజునైనా నిజాలు మాట్లాడకుండా అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దని, అయినా కెటిఆర్ అక్కడికి వెళ్ళి విద్యార్థులతో పాటు ధర్నాలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో నిరసనలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులకు మద్దతుగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలూ అండగా నిలబడితే కెసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.











