
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదం.. విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో మోడీ తప్పుచేశారా? గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలో అతిపెద్ద పోటీ పరీక్షలలో అక్రమాలు జరగడం, దానిపై స్పందించడానికి సమయం పట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, పరీక్షా వ్యవస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. జంతర్ మంతర్ వేదికగా సిజెపి, నిరసనకారులు చేపట్టిన ఉద్యమంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా అనేది అత్యంత కీలకమైన, రాజీలేని డిమాండ్ గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల సమస్యలపై ఊపందుకున్న ఈ ఉద్యమం స్వల్ప కాలంలోనే కేంద్ర నిర్ణయాలను ప్రభావితం చేయగలదని నిరూపించింది. పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ రాజీనామాను ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తొలుత ఉద్యమాన్ని లైట్ తీసుకుంది కేంద్రం. అయితే ఉద్యమం తీవ్రత గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. అయితే నీట్ పరీక్ష లీక్ వివాదం, విచారణ జరుగుతున్న సమయంలోనే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి ఉంటే మరింత సముచితంగా ఉండేదని భావిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని మట్టికరిపించి, బిజెపి జెండా ఎగరేయడం, గోవాలో మిత్రపక్షాలతో గెలవడం, అసోంలో గెలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలో నీట్ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేవలం రాజీనామాతో సమస్య తీరదని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలోని లోపాలను గుర్తించి సరిదిద్దడం, చట్టపరమైన సంస్కరణలు తేవడమే ప్రాథమిక ప్రాధాన్యతగా ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికే ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. కాంగ్రెస్ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుని ప్రధాని మోడీ ఇంటిముందే ధర్నా చేసే సాహసం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి తోడు కాంగ్రెస్ కూడా ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో ప్రధాని మోడీ దిగిరాక తప్పలేదు.
ఇటీవల సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ, సిజెపి ఉద్యమం మాత్రం కొనసాగుతోంది. సిజెపి విధించిన 24 గంటల డెడ్‌లైన్ లోగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. పేపర్ లీక్ ముఠాలను అరెస్టు చేయడం, సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి నిజానిజాలు బయటకు తీయడానికి దర్యాప్తు సంస్థలకు కొంత సమయం పట్టింది. నిరసనకారులు, విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం పలు విడతల చర్చలు జరిపి, వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం ఆలస్యం అయింది. పరీక్షా వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి, కఠిన చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని పంపే ప్రయత్నం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నకిలీ వార్తల ప్రచారం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. దాంతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు.
పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న 480 ఖాతాలను బ్లాక్ చేశారు. ప్రజలు నకిలీ, వాస్తవ సమాచారానికి మధ్య తేడా గుర్తించగలిగేలా.. మా సోషల్ మీడియా ఖాతాల్లో ఎఐ, డీప్‌ఫేక్, ఎడిట్ చేసిన క్లిప్‌లు, తప్పుదోవ పట్టించే పోస్ట్‌ల గురించి నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం అని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో జరిగిన నిరసనల్లో పోలీసుల, భద్రతా బలగాల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ, తీవ్ర బలప్రయోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. జులై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ ముట్టడి సందర్భంగా నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించడం వివాదాస్పదం అయింది.
పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) బలగాలు ఆందోళనకారులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారని నిరసనకారులు ఆరోపించారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆంతరంగిక విచారణ ప్రారంభించినట్లు ఆర్‌ఎఎఫ్ ప్రకటించింది. ఈ ఘర్షణ వాతావరణంలో సుమారు 180 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో దాదాపు 118 మంది భద్రతా సిబ్బంది కాగా, 60 నుంచి 150 మంది వరకు విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే నెపంతో పలువురు సిజెపి నాయకులు, విద్యార్థి ప్రతినిధులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, వందలాది మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సిజెపి ప్రతినిధులు పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు చేశారు. గాయపడిన విద్యార్థులకు ఢిల్లీ పోలీసు కమిషనర్, ఆర్‌ఎఎఫ్ చీఫ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడానికి, దేశవ్యాప్తంగా సాగిన నీట్ నిరసనలు, వరుస రాజకీయ పరిణామాలు ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. నీట్ యుజి 2026 పరీక్షలో అక్రమాలు & పేపర్‌లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మే 3న జరిగిన నీట్‌యుజి పరీక్షలో పేపర్ లీక్, అక్రమాలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపింది. ఈ ఘటనపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించి, రీ-టెస్ట్ ప్రకటించినప్పటికీ విమర్శల స్థాయితగ్గలేదు. జంతర్ మంతర్ వద్ద తీవ్రస్థాయిలో నిరసనలు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నెలరోజులకు పైగా కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు, యాక్టివిస్టులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపడానికి ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా’ తప్పనిసరి నిబంధనగా నిరసనకారులు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు విద్యాశాఖ మంత్రి సమర్థతపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందేనని పట్టుబట్టడం, జులై 20 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలు ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని పెంచాయి. ప్రధాని నరేంద్ర మోడీకి పంపిన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా పేర్కోంటూ ఈనిరసనల పరిస్థితులను దేశవ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకుండా చూడటానికి, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా కాపాడటానికే నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు తెలిపారు.
సిబిఐ విచారణ, రీ-టెస్ట్, వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి) విధానం తెస్తామని ప్రకటించినప్పటికీ... విద్యార్థుల వైపు నుంచి వచ్చిన సుదీర్ఘ పోరాటం, కేంద్రంతో చర్చల కోసం విధించిన షరతులు, నైతిక బాధ్యత దృష్ట్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల సమస్యలపై ఊపందుకున్న ఈ ఉద్యమం స్వల్పకాలంలోనే కేంద్ర నిర్ణయాలను ప్రభావితం చేయగలదని నిరూపించింది. నీట్ బాధితులకు తగిన నష్టపరిహారం అందించడం.. నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం.. భవిష్యత్తులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమగ్ర సంస్కరణలు అమలు చేసినప్పుడే విద్యార్ధులు చేసిన ఉద్యమాలకు అర్థం ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి దక్కిన సింహభాగ విజయంగానే పరిగణించబడుతోంది.
- జి సత్యనారాయణరాజు
90308 80709








