
కొండపై నుంచి భారీ బండరాళ్లు విరిగి, దొర్లుతూ కదులుతున్న వాహనంపై పడటంతో ఆరు నెలల చిన్నారి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కులూ నుంచి కిల్లార్‌కు వెళుతున్న ఎస్‌యూవీలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. కాడు నాలా సమీపానికి చేరుకోగానే పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాళ్లు వాహనంపై పడ్డాయి. వాటి ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనంతరం వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో వాహనం దాదాపు పూర్తిగా నలిగిపోయి, మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలను ఘటనాస్థలికి పంపించారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్ కిరణ్ బదానా ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదస్థలికి వెళ్లి సహాయ, రక్షణ చర్యలను పర్యవేక్షించాలని లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.వాహనంలో నుంచి దూకిన ఇద్దరు మినహా మిగిలిన వారంతా ప్రమాదంలో మరణించినట్లు భర్మౌర్ ఎమ్మెల్యే జనక్ రాజ్ తెలిపారు. ప్రమాదస్థలికి చంబా జిల్లా సమీపంలో ఉండటంతో చంబా, లాహౌల్-స్పితి జిల్లాల అధికారులు సహాయ చర్యలను వేగవంతం చేయాలని కోరారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారి గురువారం మూసివేయడంతో ప్రయాణికులు టిండిలో చిక్కుకుపోయారు.
శుక్రవారం రహదారిని తిరిగి తెరవడంతో పాంగి వైపు బయలుదేరారు. మృతుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.మృతుల కుటుంబాలకు సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందించాలని ముఖ్యమంత్రి సుఖు అధికారులను ఆదేశించారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.మరో ఘటనలో మండీ జిల్లాలోని జోగిందర్‌నగర్ పరిధిలోని గుమ్మా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. కులూ నుంచి సిమ్సా మాత ఆలయానికి వెళుతున్న ఓ కుటుంబం కొండచరియల కింద చిక్కుకుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడే ఘటనలు పెరుగుతున్నాయి.











