
సీమైన్స్ తగలడంతో ఘటన
తప్పుడు మార్గంలో వెల్లడం వల్లే పేలింది : ఇరాన్
అమెరికాతో చర్చలకు షరతులు
ఉక్రెయిన్‌కు హెచ్చరికలు
హెజ్‌బొల్లాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మద్దతు
దుబాయి/టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఘర్షణలు సద్దుమణుగుతున్నాయని అనుకునేలోపే ఏదో ఒక ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటు చేసిన సీమైన్ తగిలి ఓ చమురు ట్యాంకర్ పేలిపోయింది. తాము నిర్దేశించిన మార్గం గుండా కాకుండా మరో మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఇరాన్ ప్రకటించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం వివరాలు బయటికి రాలేదు. అమెరికా, ఇరాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇది ఊరటనిచ్చే పరిణామమేనని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో ట్యాంకర్ పేలుడు ఘటన జరగడంతో మళ్లీ ఆందోళన నెలకొంటోంది. మరోవైపు సౌదీ అరేబియాలో హౌతీల దాడుల నేపథ్యంలో చమురు రవాణా కూడా మందగిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి.
బాబ్ ఎల్‌మండెబ్ జలసంధి గుండా ఇటీవల 11 నౌకలు మాత్రమే వచ్చినట్లు కెప్లర్ సంస్థ ప్రకటించింది. ఇక చర్చలకు ఇరాన్ కొత్త షరతులు విధించింది. హర్మూజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ధ్రువీకరించాలని, ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేసిన తర్వాతే చర్చలు ముందుకుసాగుతయని ప్రకటించింది. ఇవి పరిష్కారమయ్యాయకే అణ్వాయుధాలకు సంబంధించిన చర్చలు ముందుకెళ్తాయని వెల్లడించింది. ఇక హెజ్‌బొల్లాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొంటున్న తీరు అభినందనీయమన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే ఈ యుద్ధం ముగుస్తుందని అమెరికాకు స్పష్టం చేశారు. మొజ్తాబాకు కృతజ్ఞత చెబుతూ హెజ్‌బొల్లా కూడా లేఖ విడుదల చేసింది. కాస్పియన్ సముద్రంలో తమ నౌకపై దాడి చేసిన ఉక్రెయిన్‌ను కూడా వదిలిపెట్టబోమని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఘటనలో తమ నావికుడొకరు మరణించారని వెల్లడించింది.











