
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం, రాంపూర్ పంప్‌హౌజ్ వద్ద ఎస్పారెస్పీకి కాళేశ్వరం జలాలు ఎదురెక్కతున్న వీడియోను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు భరోసాను ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు అని పేర్కొన్నారు.











