ఏడు నెలలు వానలొస్తేనే... కరువు మాయం 

సాధారణం కంటే 120% వర్షపాతం అవసరం.. ఇంగ్లండ్‌లో 75% ప్రాంతం ఇంకా కరువులోనే

లండన్‌: ఒకటి రెండు భారీ వర్షాలు పడితే కరువు తీరిపోతుందా? కాదు అంటోంది తాజా పరిశోధన. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరువు పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడాలంటే వచ్చే ఏడు నెలల్లో సాధారణం కంటే 120 శాతం వర్షపాతం నమోదుకావాల్సి ఉంటుందని ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ (ఈఏ) అంచనా వేసింది. అంటే కేవలం భారీ వర్షాలు కాదు.. వరుసగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. అసాధారణంగా పొడిబారిన వసంతం, వేసవి, వరుస వేడిగాలుల కారణంగా ఇంగ్లండ్‌లో దాదాపు 75 శాతం ప్రాంతం ఇప్పటికీ కరువు ప్రభావంలోనే ఉంది. ఇటీవల వర్షాలు కురిసినా భూగర్భజలాలు, జలాశయాలు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. గత వారం ఇంగ్లండ్‌ రిజర్వాయర్లలో నీటి నిల్వ సుమారు 57 శాతానికే పరిమితమైంది. సాధారణ స్థాయితో పోలిస్తే ఇది దాదాపు ఐదో వంతు తక్కువ.

కరువు ముగిసిందని ప్రకటించాలంటే నదులు, భూగర్భజలాలు, రిజర్వాయర్లు సాధారణ స్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే తాజా వర్షాలు ఇప్పటివరకు ఆ లోటును భర్తీ చేయలేకపోయాయి. 2025 సెప్టెంబర్‌ నుంచి 2026 మార్చి వరకు ఇంగ్లండ్‌లో సాధారణం కంటే 130 శాతం వర్షపాతం నమోదైనా, ఆ తర్వాతి పొడి వాతావరణం నీటి నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏప్రిల్‌ 2027 నాటికి అన్ని ప్రాంతాలు కరువు నుంచి బయటపడాలంటే వచ్చే ఏడు నెలల్లో సగటు కంటే 120 శాతం వర్షం అవసరమని అంచనా. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం వర్షాలు పెరిగినా డెవాన్‌, కార్న్‌వాల్‌, ఈస్ట్‌ ఆంగ్లియా ప్రాంతాలు అప్పటికీ కరువులోనే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు సమస్యకు పూర్తి పరిష్కారం కావని నిపుణులు చెబుతున్నారు. వేగంగా వచ్చే వరద నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేయడం కష్టమని, అందులో మట్టి, ఇతర కాలుష్యాలు అధికంగా ఉండే అవకాశం ఉందని ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ పేర్కొంది.