అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయో పరిమితిని 21కి తగ్గించాలి

యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి

ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ

తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం

‘నీట్’ ఆందోళనలు, నమోదైన కేసులపై కేంద్రం సమీక్షించాలి

నష్టపోయిన కుటుంబాలకు సాయం చేయాలి

జాతీయ మీడియాతో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ‘జై జవాన్ జై కిసాన్ - జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరా రు. హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో ఆదివారం జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. యువశక్తే దేశ భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రం గాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యు వతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల నిర్వహించిన సీబిఎస్‌ఈ, నీట్, నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై సిఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిథ్యం కల్పించాలి

విద్యార్థులు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తగిన చర్య లు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆందోళనల సందర్భంగా నమోదైన కేసుల ను సమీక్షించడంతో పాటు నష్టపోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేటి యువత 21 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపిఎస్ అధికారులుగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనా, వ్యాపార రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్న యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన విషయాన్ని, 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయస్సును 21 ఏళ్లకు సవరించిన విషయాన్ని సిఎం ప్రస్తావించారు.

కనిష్ట వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి

అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయస్సును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ఆగష్టు నెలలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సిఎం తెలిపారు. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం పోటీ వయోపరిమితి తగ్గింపును కోరుతూ అధికారిక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్‌కు అవసరమని తెలిపారు.