1998లో మన దేశంతో పాటు పాకిస్థాన్ కూడా అణ్యస్త్రాలను ప్రయోగించి తమ సత్తా చాటుకొని అణ్యస్త్ర దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దేశ సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ఫిబ్రవరి 1999లో లాహోర్ డిక్లరేషన్లో సంతకాలు చేశాయి. ముందు బుద్దిమంతుల వలె, వెనుక మోసగాళ్ల వలె నడపకున్న చరిత్ర కలిగిన పాకిస్థాన్ తన నీచ బుద్ధిని తరుచుగా చూపిస్తూనే ఉన్నది. ఇలాంటి దుర్బుద్ధి కలిగిన పాపాల పాకిస్థానీ కుట్రల్లో భాగంగా కశ్మీర్లో అలజడి సృష్టించడం, సైన్యం చొరబాట్లు జరపడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్లో హింసాత్మక చర్యలను ప్రేరేపించడం, వాస్తవాదీన రేఖను దాటి వ్యూహాత్మక కీలక భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం తరుచుగా కొనసాగుతూనే ఉన్నాయి.

1999 అక్టోబర్, మే మాసాల్లో లడక్ ప్రాంత కార్గిల్ జిల్లా సరిహద్దుల్లో పాకిస్థానీ సైనికులు వాస్తవాదీన రేఖను 130 - 200 చ కి మీ మేర దాటి భారత భూభాగంలోకి ప్రవేశించి, పర్వత శిఖరాలను, వ్యూహాత్మక మిలిటరీ స్థావరాలను ఆక్రమించారు. ఈ ఆక్రమణలతో కశ్మీర్, లడక్ల మధ్య సంబంధాలను అడ్డుకోవాలనే కుట్రలను పన్నింది పాపాల పాకిస్థాన్. 03 మే 1999 రోజున గొర్ల కాపరుల ద్వారా అసలు పాకిస్థాన్ దురాలోచనలను పసిగట్టిన భారత సైనికులు, పరిస్థితుల తీవ్రతలను గమనించి ఉన్నతాధికారులకు చేరవేయడం జరిగింది. పరిస్థితులను లోతుగా అన్వేషించిన భారత రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో రెండు లక్షల సైనిక బలగాలతో కార్గిల్ పరిరక్షణ దిశగా యుద్ధం ప్రకటించింది. యుద్ధానికి అనువైన ఎత్తైన భూభాగాలను ఆక్రమించిన పాక్ సైన్యం, చొరబాటుదారులదే పై చేయిగా ప్రారంభంపైన భీకర యుద్ధం రెండు నెలలు, 3 వారాలు, 2 రోజులు కొనసాగింది. ఈ పోరులో పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగాలను తిరిగి చేజిక్కించుకొని, 26 జూలై 1999 రోజున భారత్ విజయాన్ని ప్రకటిస్తూ, టైగర్ హిల్స్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేసి అధికారికంగా యుద్ధం ముగిసినట్లు, పాక్ సైన్యం తలవంచి తోక ముడిచినట్లు ప్రకటించింది. కార్గిల్ యుద్ధ విజయంలో భారత ఆర్మీతో పాటు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కూడా చేయి అందించడంతో పాకిస్థాన్ సైన్యం తలవంచక తప్పలేదు. భారత సైన్యం చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, ప్రాణాలను సహితం లెక్కించక ముందడుగు వేసిన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రతి ఏట 26 జూలై రోజున దేశ భక్తి ఉప్పొంగే కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి భారత పౌరుడు అత్యంత అభిమానం, దేశం పట్ల ప్రేమతో ఘనంగా నిర్వహించుకోవడం సర్వసాధారణం అయ్యింది. కార్గిల్ విజయ్ దివస్ రోజున ఢిల్లీలోకి ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించడంతో పాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి అయ్యింది. శ్రీనగర్కు 205 కిమీ దూరంలో ఉన్న కార్గిల్లో రక్తం గడ్డకట్టకు పోయే అతిశీతల -45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల నడుమ భారత సైన్యం చేసిన యుద్ధం అనన్యసామాన్యం, అనితరసాధ్యం అని చరిత్ర రుజువు చేస్తున్నది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పర్వత శిఖరాల పై భాగాన దొంగచాటుగా చేరిన పాక్ సైనికులతో పర్వతాలు ఎక్కుతూ, పాక్ కాల్పులను తప్పించుకుంటూ, భారత సైన్యం చూపిన యుద్ధ నీతి రేపటి మిలటరీ చరిత్రకు పాఠ్యాంశం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ యుద్ధంలో రెండు వైపుల సైనికులు ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో ముందుకు సాగిన కార్గిల్ పోరులో భారత పక్షాన 527 మంది ప్రాణత్యాగం చేయడంతో పాటు 1,363 మంది సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ పక్షాన 1,200 సైనికులు-చొరబాటుదారులు మరణించగా, 1,000కి పైగా గాయపడ్డారు. నిత్యం చొరబాట్లనా ప్రోత్సహించడం, ఉగ్రవాదులకు శిక్షణలు ఇవ్వడంతో పాటు ఆధునిక ఆయుధాలను అందించడం చేస్తున్న పాకిస్థాన్కు గతంతోనే 1947, 1965, 1971 ఇండోపాక్ యుద్ధాల్లోను ఓటమి పరాభవాలు చవి చూపింది. కార్గిల్ యుద్ధంలో భారత వీర అమర జవాన్ ‘కెప్టెన్ విక్రమ్ బాత్రా’ను కార్గిల్ హీరోగా, హెలికాప్టర్ పైలెట్ ‘ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా’ను కార్గిల్ గర్ల్‌గా వారి వీరత్వాన్ని ప్రస్తుతిస్తున్నది.

కుక్క తోక వంకరే అన్నట్లుగా ఇటీవల 22 ఏప్రిల్ 2025 రోజున పహెల్గామ్ దుర్ఘటనలో పాక్ ఉగ్రవాదులు 26 మంది అమాయక హిందువులను గుర్తించి కాల్చి చంపడంతో కన్నెర్ర చేసిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలను బాంబులతో మట్టుబెట్టడం, పాకిస్థాన్ మిలటరీ స్థావరాలను నేలమట్టం చేయడం, పాకిస్థాన్ ఓటమిని అంగీకరించే స్థితికి తీసుకురావడం కూడా చూసాం. నేడు తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కొనసాగినా ఏ క్షణమైన పాక్ తోక కదిపితే భారత సైన్యం ధీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. రాబోయే రోజుల్లో పాక్ పిచ్చకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిందే, బుద్ధిలేని పాకిస్థాన్కు తగిన స్థానం చూపాల్సిందే. భారతీయులు నేడు 27వ కార్గిల్ విజయ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలుద్దాం. కార్గిల్ విజయంలో భాగస్వాములైన జవాన్లను హృదయపూర్వకంగా అక్కున చేర్చుకొని సన్మానించుకుందాం. కార్గిల్ యుద్ధ చరిత్రను నేటి యువతకు వివరిస్తూ, వారిలో భారత్ పట్ల ప్రేమను రగిలిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై విద్వాన్, జై అనుసంధాన్, భారత్ మాతా కీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు వినిపిద్దాం.

(నేడు కార్గిల్ విజయ్ దివస్)


డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037