న్యూఢిల్లీ: జాతీయతను నిర్ధారించాకే విదేశీయులను వారి స్వదేశానికి డిపోర్ట్ చేస్తామని, ఎవరైనా వ్యక్తి జాతీయతను ధ్రువీకరించడానికి విదేశాలు అంగీకరించకుంటే వారిని బహిష్కరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన కొందరిని స్వదేశాలకు పంపకుండా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

ఒక విదేశీయుడికి శిక్ష కానీ కోర్టు విచారణ కానీ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి వద్ద చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రం కానీ పాస్‌పోర్ట్ కానీ ఉండి, క్రిమినల్ కేసులో పెండింగ్‌లో లేకపోతే వారని దేశం నుంచి బహిష్కరించవచ్చని కేంద్రం తెలిపింది. విదేశీయులను దేశ నుంచి డిపోర్ట్ చేయాలంటే సంబంధిత దేశ రాయబార కార్యాలయం నుంచి జాతీయత ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కేంద్రం ఆ అవిడవిట్‌లో వివరించింది.