
యువతలో మోడీ పాపులారిటీ చూసి రాహుల్ భయపడుతున్నారు
ఇంకెంతోకాలం ఆయన యువనేతగా చెలామణి కాలేరు
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యువతలో పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ భయపడుతున్నారని, తనను తాను యువనేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ క్రమంగా యువతలో ఆదరణ కోల్పోతుండటమే ఆ భయానికి కారణమమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యువ ఓటర్ల మద్దతు బీజేపీకే ఉందని, జెన్ జీ యువత ఎప్పుడూ తమతోనే ఉందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నేత మోడీ అని చెప్పారు. యువతతో నిరంతరం మమేకం కావడం, సోషల్ మీడియా వేదికలపై ఆయన చురుకుగా ఉండటం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే యువతకు చేరువ కావాలని రాహుల్ తాపత్రయపడుతున్నారని, తనను తాను యువనేతగా ఆయన అనుకుంటున్నప్పటికీ మోదీ అంత పాపురాలిటీ ఆయనకు లేదనే విషయం నిరూపితమైందని అన్నారు.
ఓటర్లు పదేపదే కాంగ్రెస్ సహా విపక్షాలను తోసిపుచ్చడంతో నిరాశానిస్పృహలతో ఆ పార్టీలు ఉన్నాయన్నారు. పేపర్ లీక్ సవరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ తదితర విపక్ష పార్టీలు సపోర్ట్ చేసి ఉండాల్సిందని, అయితే బిల్లును ఆ పార్టీలు వ్యతిరేకించడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు.











