
జిఎస్‌టి వృద్ధి రేటులో హర్యానా తరువాత రెండోస్థానంలో తెలంగాణ
19 శాతం పెరిగిన జిఎస్‌టి
దేశవ్యాప్తంగా సగటు జిఎస్‌టి వృద్ధిరేటు 10 శాతం మాత్రమే
ఎగవేతలపై కఠిన చర్యలతోనే సత్ఫలితాలు
వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్‌రావు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది జూలైలో వాణిజ్య పన్నుల శాఖ చరిత్రలోనే అత్యధికంగా రూ.7,865 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి ఈ ఆదాయం సమకూరగా, గత ఏడాది జూలైతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదు అయింది. గతంలో ఏప్రిల్ 2026లో నమోదైన రూ.7,598 కోట్ల రికార్డును కూడా ఈ వసూళ్లు అధిగమించాయని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జూలై నెలలో జీఎస్టీ ద్వారా మాత్రమే రూ.4,452 కోట్ల ఆదాయం లభించగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికంగా వసూలైందని తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.5,819 కోట్లకు చేరగా, రాష్ట్రాల వారీగా వృద్ధి రేటులో హర్యానా తర్వాత రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వృద్ధి సగటు 10 శాతంగా నమోదైందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, మెరుగైన పన్ను చెల్లింపు క్రమశిక్షణతో పాటు సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, పన్ను ఎగవేతపై కఠిన చర్యల వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని శాఖ పేర్కొంది.
సుమారు రూ.300 కోట్ల మేర మోసపూరిత ఐటీసీని అడ్డుకున్నాం
గత నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వ్యవహారాల్లో పాల్గొన్న 165 మంది పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేసి, సుమారు రూ.300 కోట్ల మేర మోసపూరిత ఐటీసీని అడ్డుకున్నట్లు కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు. జూలై నెలలో రిటర్నులు దాఖలు చేసి పన్నులు చెల్లించిన 4,61,276 మంది పన్ను చెల్లింపుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకమైన, సమర్థవంతమైన, పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను వ్యవస్థను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు కమిషనర్ రఘునందన్ రావు తెలిపారు.











