
జపాన్ ప్రధాన మంత్రి టకైచి ప్రభుత్వ హయాంలో శుక్రవారం ఉదయం తొలిసారిగా ఒక ఉరిశిక్ష అమలు చేశారు. 2009లో ఒసాకా లోని రద్దీగా ఉన్న పచింకో పార్లర్‌కు నిప్పంటించి ఐదుగురిని హత్య చేసిన వ్యక్తిని ఉరి తీశారు. జపాన్‌లో విచారణలో మరింత పారదర్శకత, మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉరిశిక్ష అమలైంది. సునావో టకామీ అనే వ్యక్తి పచింకో పార్లర్‌లో పెట్రోల్ చల్లి మండుతున్న అగ్గిపుల్లను విసరడంతో భవనమంతా మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటనలో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.
ఈ సంఘటన సమాజంలో తీవ్ర భయాందోళనలను కలిగించిందని , ప్రాణాలు కోల్పోయిన బాధితులు ఊహించలేనంత బాధ, భయాన్ని అనుభవించి ఉంటారని, న్యాయశాఖ మంత్రిగా అన్ని అంశాలను జాగ్రత్తగా , సమగ్రంగా పరిశీలించిన తరువాత ఉరిశిక్ష అమలు చేయాలని తాను ఆదేశించినట్టు న్యాయశాఖ మంత్రి తెలిపారు. 58 ఏళ్ల టకామీని హత్య, హత్యాయత్నం , అగ్ని ప్రమాదాన్ని సృష్టించడం వంటి నేరాల్లో దోషిగా తేల్చారు. 2011లో ఒసాకా జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విదించింది. అతని అప్పీళ్లను 2016లో జపాన్ సుప్రీం కోర్టు తిరస్కరించి మరణశిక్షను సమర్థించింది.








