
న్యూఢిల్లీ : జిస్‌టి వసూళ్లలో దేశం మరింత పురోగతిని సాధించింది. జులై నెలకు సంబంధించిన వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ శనివారంనాడు విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.2.11 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాది జులైతో పోలిస్తే ఇది 15.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జిఎస్‌టి వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం రెండోసారి.
అంతకుముందు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.దేశీయ వ్యాపార లావాదేవీల నుంచి వచ్చిన పన్ను ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దిగుమతులపై లభించిన స్థూల పన్ను ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.66,511 కోట్లకు పెరిగింది.
జులై నెలలో కేంద్ర జిఎస్‌టి రూ.39,835 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టి రూ.47,881 కోట్లు, సమీకృత జిఎస్‌టి రూ.1.23 లక్షల కోట్లు నమోదయ్యాయి. జులై నెలలో మొత్తం రూ.29,968 కోట్ల రీఫండ్లు జారీ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వాటిని మినహాయించిన తర్వాత నికర జిఎస్‌టి వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో రూ.5,819 కోట్ల జిఎస్‌టి వసూళ్లు నమోదైనట్లు వెల్లడించింది. ఇది గతేడాది జులైతో పోలిస్తే 19 శాతం పెరుగుదల. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జులై నెలలో రూ.3,366 కోట్ల జిఎస్‌టి వసూలైనట్లు ప్రకటనలో పేర్కొంది.











