
సూరత్: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విదేశాల్లో ఉన్నత విద్య ఎలా అభ్యసించారనే అంశంపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన అభిజీత్ తండ్రి భగవన్‌రావు దిప్కే తన కుమారుడి విదేశీ విద్యకు నిధులు ఎలా సమకూర్చారనే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను కోరారు. అదే సమయంలో, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన ఆందోళనల్లో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న సీజేపీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోట్ల నిధిపైనా ఎన్నికల సంఘం, పన్నుల శాఖలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ చట్టబద్ధంగా నమోదు కానప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ విరాళాలు స్వీకరించడం సరైనదేనా అనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పరిశీలించాలని అమిత్ తివారీ కోరారు. “కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల సంఘంలో నమోదు కాని సంస్థ. అయినప్పటికీ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని న్యాయ సహాయ నిధికి రూ.1 కోటి ప్రకటించిన నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల చట్టం1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఆ పార్టీ ఎన్నికల సంఘంలో నమోదు అయిందో లేదో పరిశీలించాలి. నమోదు కాలేదంటే రాజకీయ పార్టీ పేరుతో నిధులు సేకరించడం, స్వీకరించడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని విచారించాల్సిన అవసరం ఉంది” అని తివారీ పేర్కొన్నారు.
అంతేకాకుండా, కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోటి న్యాయ సహాయ నిధిపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తిస్తుందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ)ను ఆయన కోరారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో అరెస్టయిన నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిధికి రూ.1 కోటి విరాళం అందజేస్తున్నట్లు కపిల్ సిబల్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.











