ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్ట స్థాయిలో సాగునీరు అందిస్తాం

ఇందుకోసమే గోదావరి జలాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నాం

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ 

మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి/గోదావరిఖని/అంతర్గాం: ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్ఠంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్ర వాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చే స్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమశాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వ రం భద్రతే మా తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004, జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చే శారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పె ట్టడం జరిగిందని తెలిపారు.

ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ము ఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు. జా తీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. డీపీఆర్ ప్రకా రం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పు నాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు.

గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రం గంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దే వాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగ ర్, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తిచేయలేదని విమర్శించారు.

ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలు గా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోయకపోయినా, కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి ప్రస్తుత జ లస్థితిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.