గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్‌టన్ హారిజంటల్ బార్‌పై ప్రదర్శన చేస్తుండగా పట్టు తప్పి నేలపై బలంగా పడిపోయాడు. గ్లాస్గోలో జరుగుతున్న పురుషుల జట్టు ఫైనల్‌లో విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేడియం ఒక్కసారిగా అవాక్కైంది. వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి చేరుకుని చికిత్స అందించారు. తలకు బలమైన గాయం అవ్వడంతో అసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా పోటీ కొంతసేపు నిలిచిపోయింది. తదనంతరం ఆ జట్టు అతడు లేకుండానే పోటీని పూర్తి చేసి రజత పతకం సాధించింది. కెనడా స్వర్ణం, ఆస్ట్రేలియా కాంస్య పతకం గెలుచుకున్నాయి.

లాంగ్‌టన్ స్పృహలోనే ఉన్నాడని, వైద్యులతో మాట్లాడుతున్నాడని ఇంగ్లండ్ జట్టు వెల్లడించింది. ఆసుపత్రిలో పలు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సానుకూలంగా వచ్చాయని తెలిపింది. ఎలాంటి తీవ్ర గాయాలు లేవని వైద్యులు తేల్చారు. దీంతో లాంగ్‌టన్‌ను డిశ్చార్జ్ చేసి జట్టు సభ్యులు ఉంటున్న హోటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. రజత పతక స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా.. త్వరలో జట్టుతో కలిసి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉంది.