
హైదరాబాద్: రాష్ట్రాన్ని సాధించడం కోసమే గులాబీ జెండా వచ్చిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాటం చేశామని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడితే కాంగ్రెస్- బిజెపిలు వణికిపోతున్నాయని తెలియజేశారు. తెలంగాణ భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్య్రకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోరాటంలో రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మాజీ సిఎం కెసిఆర్ అని కెసిఆర్ లేకుంటే వీళ్లకు పదవులు వచ్చేవా? అని ప్రశ్నించారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణను చూస్తున్నామంటే దానికి కారణం కెసిఆర్ అని కొనియాడారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం కెసిఆర్ కట్టించిందేనని, కెసిఆర్ ఏర్పాటు చేసిన దాదా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడుతారా? అని ప్రశ్నించారు. కెటిఆర్ వేసిన రోడ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయని, బిఆర్ఎస్ హయాంలో కట్టిన ఇండ్లు బస్తీల్లో ఉన్నాయని అన్నారు. పదేళ్లు మనకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. కష్టపడి పని చేశామని, బిఆర్ఎస్ అంటే పోరాటాల పార్టీ అని తలసాని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాను ప్రజల్లో ఎండగట్టాలని, గులాబీ జెండా పేదోడికి అండని సూచించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీల్లో అనేక సమస్యలున్నాయని, హైదరాబాద్ సిటీ దిక్కు లేదని.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడుతాడంటానని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని, రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.











