కారు డ్రైవింగ్ చేసి బీభత్సం సృష్టించడంతో ఓ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన యూసుఫ్‌గూడలోని కార్మికనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ, కార్మికనగర్‌కు చెందిన రాజ్‌కుమార్(60), ప్రభాకర్(55) ఇద్దరు సోదరులు స్కూటీపై వచ్చి ఓ ఇంటి ముందు బైక్‌పార్క్ చేస్తుండగా కారు నడుపుకుంటూ వచ్చిన బాలుడు(17) వారిని ఢీకొట్టాడు. కారుపై అదుపు కోల్పోవడంతో వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో రాజ్‌కుమార్ కారుతో పాటు ఈడ్చుకుపోయాడు. దీంతో ఏడుబైక్‌లు ధ్వంసం కావడంతోపాటు రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్‌పై కారు వెను టైర్ ఆగిఉండడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు కారును పైకి లేపి రాజ్‌కుమార్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. బాలుడికి డ్రైవింగ్ రాకున్నా కారును నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. కారు డ్రైవింగ్ చేసిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.