మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: అసెంబ్లీ సీట్లు పెరిగితే 117.. ఉన్నట్టే ఉంటే 90 సీట్లు తమవేనని, 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు టర్మ్‌లు ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ గడ్డ అని, నకిరేకల్ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. దమ్ముంటే తమ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలకు స వాల్ విసిరారు. నకిరేకల్ నుంచి ఫస్ట్ సిరిసిల్ల.. త ర్వాత సిద్దిపేటపై దండయాత్ర చేస్తానని సీఎం ప్రకటించారు. ఈ నెలాఖరున సిరిసిల్లలో భారీ సభ నిర్వహిస్తామని, వచ్చేనెల సిద్దిపేటలో దండయాత్ర చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెం డు నియోజకవర్గాల్లో మూడురంగుల జెండా ఎగరేస్తామన్నారు. తెలంగాణ తులసీవనంలో బీఆర్‌ఎస్ గంజాయి మొక్కను మొలవనివ్వబోమని వ్యాఖ్యానించారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను నే డు ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. అనంతరం రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో నిర్వహించిన వెయ్యిరోజు ల ప్రజాపాలన ప్రగతిసభలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి వరదలైనట్టుగా సభ కు జనం వచ్చారని, దీంతో మళ్లీ ప్రజా ప్రభుత్వం రావడం ఖాయమని తేలిపోయిందన్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో వెయ్యిరోజుల్లో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ రూ.22 కోట్లు అన్నిరకాల సౌకర్యాల కోసం పొందారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇంతకాలం ప్రజా సమస్యలపై ప్రశ్నించని కేసీఆర్ శాసనసభకు వచ్చి సమాధానం చెప్పాల ని, లేదంటే గౌరవంగా రాజీనామా చేయాలని సూచించారు. తన హయాంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఒక్కరోజూ సభకు రాని కెసిఆర్‌ను డిస్మిస్ చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. తనకు ఇంగ్లీష్ రాదంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. చదువు ఉన్నా లేకపోయినా తనకు సంస్కారం ఉందన్నారు. తన కుటుంబంలోని మహిళను సరిగ్గా చూసుకోలేని వారు తెలంగాణలోని కోటిమంది ఆడబిడ్డల బాగోగులు ఎలా చూస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. మర్యాదగా ఉండటాన్ని చేతగానితనంగా భావించొద్దన్నారు.


ప్రజాపాలనా.. కుటుంబ పాలనా?

పేదలకు న్యాయం చేసే ప్రజాపాలన కావాలా? కుటుంబపాలన చేసిన పాపాలబైరవుడు కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కొందరు ఊరూరా తిరుగుతూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్, హరీశ్‌రావు మంత్రులయ్యారని, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి, వినోద్‌కుమార్, కవితలకు పదవులు, సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ పదవి దక్కాయని పేర్కొన్నారు. తన ప్రభుత్వం మాత్రం గిరిజన, దళిత, బడుగు వర్గాలకు చెందిన సీతక్క, లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌లకు మంత్రి పదవులు ఇచ్చిందని, శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిందని చెప్పారు.

గత ప్రభుత్వ పథకాలు రద్దు చేశామా?

గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తమ ప్రభుత్వం రద్దు చేసిందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉన్న పథకాలను కొనసాగిస్తూ వాటిని పెంచడంతోపాటు కొత్త పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని విమర్శించారు. ‘పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా?’ అని వ్యాఖ్యానించారు. 2018లో రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూ.7,500 కోట్ల రైతుబంధు నిధులను దిగమింగిందని, రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిందని రేవంత్ ఆరోపించారు. ఐదేళ్లలో నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాత్రమే మాఫీ చేయడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు.

తమ ప్రభుత్వ 32 నెలల పాలనలో రూ. 36 వేల కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని, గిట్టుబాటు ధర, బోనస్ అందించామని చెప్పారు. రూ.90 వేల కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బులను రైతులకు చెల్లించామని పేర్కొన్నారు. సన్నబియ్యం, రేషన్‌కార్డులు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలపై చర్చకు సిద్ధమని, శాసనసభకు వచ్చి పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, తమ వెయ్యిరోజుల పాలనపై లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. తండ్రీ కొడుకులు, మామ అల్లుళ్లు శాసనసభకు వచ్చి చర్చించాలని సూచించారు. శాసనసభ్యుడు వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి, ఉత్తమ్, పొంగులేట్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీలు చామల, రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.