
కెబిఆర్ పార్క్ పరిసరాల్లో వన్ వేను అమలు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వన్‌వే అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఐసిసిసిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్‌తో కలిసి నగర సిపి విసి సజ్జనార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెబిఆర్ పార్క్ పరిసర కారిడార్‌లో హెచ్‌సిటి ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల దృష్టా ఆంక్షలు విధించినట్లు తెలిపారు.నిర్మాణ పనుల వల్ల రోడ్డు విస్తరణ తగ్గిపోయిందని, దీంతో వాహనాల రకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
రోడ్డు ఇరువైపులా వాహనాల రాకపోకలు కొనసాగడం వల్ల ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయని తెలిపారు.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు కెబిఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వన్‌వే ట్రాఫిక్‌పై ఇప్పటికే రెండు సార్లు ఏప్రిల్ 4 , జూన్ 21వ తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. ట్రయల్ రన్ సమయంలో ట్రాఫిక్ ప్రవాహం, జంక్షన్ల పనితీరు, లేన్ క్రమశిక్షణ, రద్దీ కేంద్రాలు, వాహనదారుల రాకపోకలను పరిశీలించామని తెలిపారు.
ఇరవై నాలుగు గంటలు విధులు...
కెబిఆర్ పార్క్ వద్ద వన్ వే అమలు చేయనున్న నేపథ్యంలో ముఖ్యమైన ప్రదేశాలలో 24 గంటలు ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, వాహనదారులకు మార్గనిర్ధేశం, సాయం అందిస్తారని సిపి సజ్జనార్ తెలిపారు. అవసరమైన ప్రదేశాలలో సరైన లేన్ మార్కింగ్‌లు, లేన్ ఛేంజర్‌ల ఏర్పాటు చేశామని, సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో అవసరమైన మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వన్‌వేను ఐసిసిసిలో ఉన్న సిసిటివి నెట్‌వర్క్ ద్వారా నిరంతరం
పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి డ్రోన్ల ద్వారా రియల్-టైమ్ పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. వన్ వే ట్రాఫిక్ విధానం అమలును దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు. లేన్ మార్కింగ్‌లు, దిశా సూచికలు, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలని తెలిపారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్ల వంటి అత్యవసర వాహనాలు వెళ్లడానికి లేన్-2లో ఆటంకం కల్పించవద్దని కోరారు. కెబిఆర్ వాకర్లు, సందర్శకులు వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని తెలిపారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్...
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి సమయం, ఆఫ్-పీక్ సమయాల్లో రోడ్డుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయోద్దని స్పష్టం చేశారు. రాంగ్-సైడ్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయవద్దని కోరారు.








