
లష్కర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్‌ను గతంలో ఎవరూ పట్టించుకోలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కెసిఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కెటిఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కెటిఆర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని అన్నారు.
బోనాలు కులాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసిఆర్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 1800 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అద్భతంగా నిర్మించామని తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించి, పండుగలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో పచ్చగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు కెటిఆర్ చెప్పారు. రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు పేర్కొన్నారు. కెటిఆర్ వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అంబర్‌పేట్ ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్ తదితర నేతలు ఉన్నారు.











