మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ హయాంలో క మీషన్ల పేరిట రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పంపులు, లిఫ్టుల కోసమే వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులను సందర్శిస్తున్న సిఎం.. రెండోరోజు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహ రి, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని భావించామని..కానీ,

ఉమ్మడి పాలమూరు జిల్లాకు కెసిఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో రూ. 1 లక్ష 81 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఖర్చు చేశారని, అందులో లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు పె ట్టారని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తో 90 టిఎంసిల నీళ్లు అందించవచ్చని తెలిపారు. జూ రాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఇ తర ప్రాజెక్టులు కట్టి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని చెప్పారు. పదేళ్ల సుదీర్ఘ కాలంలో పాలమూరు ఎత్తిపోతలకే కెసిఆర్ రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని మండిపడ్డారు.

కమిషన్లతో కెసిఆర్ ఇంట్లో కనక వర్షం

రాబోయే రెండు సంవత్సరాలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్ని ప్రాధాన్యత క్ర మంలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పది ఏళ్లుగా ఈ జిల్లాలో 27 వేల కోట్ల రూపాయల ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు తీసుకురాలేదని ఆరోపించారు. ఆ నిధులతో యంత్రాలు కొనుగో లు చేసి వాటి ద్వారా కమిషన్లతో కెసిఆర్ ఇంట్లో కనక వ ర్షం కురిపించుకున్నారని ధ్వజమెత్తారు. 90% పనులు పూర్తి చేస్తామని చెప్పుతున్న బిఆర్‌ఎస్ నాయకులు అంచనాలో 50శాతం కూడా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ప్రశ్నించారు. ఆ సైన్స్, మ్యాథ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదని, తాను 80 వేల పుస్తకాలు చదవలేదంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభు త్వం చేసిన అప్పుల్లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 నెలల్లో 52 వేల కోట్ల రూపాయలను అసలు వడ్డీతో కలిపి చెల్లించినట్లు సిఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నెల ల్లో ప్రాజెక్టుల కోసం 22 వేల కోట్లు ఖర్చు పెడితే కేవలం పాలమూరు జిల్లాకు 8వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తనపై కోపంతో మక్తల్-, నారాయణపేట-, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కెసిఆర్ తొక్కిపెట్టారని ఆరోపించారు.

భూ సేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల లక్ష్యం నెరవేరదు

భూ సేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల లక్ష్యం నెరవేరదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి చేయడం కోసం ఇంకా 4000 ఎకరాల భూ సేకరణ అవసరమని, దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని నిధులు కేటాయిస్తామని పేర్కొన్నా రు. ప్రాజెక్టుల గురించి బిఆర్‌ఎస్ నేతలకు ఏం తెలుసు అని విమర్శించారు. సారా అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే సారా అంటూ ఎద్దేవా చేశారు. దోపిడీ చేయకుండా కెసిఆర్ ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, గొప్పగా కట్టానని చెప్పుకుంటున్న కాళేశ్వరం నేడు కూలేశ్వరం అయ్యిందని విమర్శించారు. కెసిఆర్ రద్దయిన వెయ్యి రూపాయల నోటులాంటి వారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఒకాయ న గోచి కట్టుకొని రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు అని, గోచి కట్టుకున్న వాళ్లందరూ రాజశేఖర్ రెడ్డిలు అయిపోతారా..? అంటూ ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలును బాధ్యతగా భావించాం

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నుండి ఉదండాపూర్ వ రకు వచ్చే జూన్ నాటికి నీళ్లు తీసుకొస్తామని సిఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, భూ సేకరణ ఇతర పనులకు నేతలు అడ్డుపడవద్దని కోరారు. జిల్లా నాయకులతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నా, 20 ఏళ్ల రాజకీయ జీ వితంలో ఎటువంటి మచ్చ లేకుండా పని చేశానని చెప్పా రు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా దేశ చరిత్రలోనే అత్యధికంగా వరి పంట పండించిన రాష్ట్రంగా నిలిచిందని సిఎం వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందు గుమ్మరిస్తామంటూ బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలు సిఎం స్పం దిస్తూ మోదీ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చారా..? అని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జా యతీ హోదా ఇస్తామన్న మోదీ హామీ బిజెపి నేతలు సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది.

స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని హామీ బిజెపి నేతలు సమాధా నం చెప్పాలంటూ సిఎం విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ ఈనెల 15 వరకు ముగుస్తుందని, అప్పటివరకు కేం ద్రం కొనుగోలు చేయాల్సిన 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయకపోతే అప్పడు వాళ్ల సంగతి చెబుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోయినా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణ గోదావరి నీళ్ల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేతే సహించేది లేదని స్పష్టం చేశారు. పంపులు, లిప్ట్ పనుల్లో అవినీతిపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఏళ్ల తరబడి పోరాడారని అన్నారు.అంత పోరాడిన నాగం చివరకు కెసిఆర్ పార్టీలోనే చేరారని విమర్శించారు.

పవన్ ప్రశ్నించారు.. పొన్నం సమాధానం చెప్పారు

తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యా ణ్ చేసిన కామెంట్లపై స్పందించేందుకు సిఎం రేవంత్ ఆసక్తి చూపించలేదు. పవన్ ప్రశ్నించారు.. పొన్నం సమాధానం చెప్పారు.. మన ఇద్దరికి ఎందుకు శ్రమ అంటూ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తుమ్మిడి హెట్టి సమస్యపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించాలని కృషి చేయాలని సూచించారు.