నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌వాడా కాలనీలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నిద్రలో ఉన్న ముగ్గురు సజీవదహనమయ్యారు.
మృతులను వనం చంద్రకళ (45), ఆమె మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా ఇంటిని వ్యాపించడంతో వంటకు ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్ భారీ శబ్దంతో పేలినట్లు సమాచారం. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కుటుంబ నేపథ్యం
చంద్రకళ తన కుమార్తె దనమ్మ పిల్లలైన మనవడు, మనవరాలితో కలిసి నివసిస్తోంది. దనమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమె తన పిల్లలతో కలిసి తల్లి ఇంట్లోనే ఉంటోంది.
ఇటీవల జీవనోపాధి కోసం దనమ్మ మూడు రోజుల క్రితం పూణెకు గృహ సహాయకురాలిగా వెళ్లినట్లు సమాచారం.












