
మగాడి జీవితమూ నిశ్శబ్ద ఆరాట పోరాటం
పిల్లాడిగా ఆటపాటలు తండ్రి వేలు పట్టి నడకలు
అమ్మ ఒడి కన్నీటిని తుడిచే గుడి
అమ్మ ఒడిలోంచి బడిలోకి బతుకు అర్థంతో
పాటు అర్థాన్ని ఆర్జించే జ్ఞాన సముపార్జన
ఉద్యోగ ఉపాధుల వేటలు
జీవనోపాధికి ఏదో ఒక వృత్తిలో మునకలు
పెళ్లితో తలపై కుటుంబ భారం
ఎదిగే కొద్దీ తన ఇష్టాల్నిచంపుకొని
కుటుంబ నవ్వుల కోసం
అలుపెరుగని అవిశ్రాంత పరుగులు
గెలుపోటముల నడుమ నలిగి పోతాడు
భర్త, తండ్రి అయ్యాక అతనో డైరీ మాత్రమే
అయి, పేజీల్లో ఖర్చులు, బాధలే
చెమట వరదల పెట్టుబడితో
కుటుంబ నవ్వుల పంటను సాగు చేస్తూ
అప్పులు, నొప్పులతో ఒంటరై పోతాడు
తన రెక్కల కింది పెరిగిన పిల్లలు
ఎదిగి ఎగిరి పోయాక ఒంటరై పోయి
ఆలి ఒడిలో పిల్లాడిలా ఒరిగి పోతాడు
జీవితాంతం అందరి కోసం బతికి
చివరగా జ్ఞాపకాలతో మిగిలిపోతాడు
తను ఎన్నిసార్లు ఓడినా.
కుటుంబం గెలుపును కోరుకుంటూ.
కన్నీటిని కలల సాగుకు వాడుకుంటూ
చెమట చుక్కలతో సాఫల్య స్నానం చేస్తూ
ఒంటరిగా వచ్చి ఒంటరిగానే నిష్క్రమిస్తాడు
- మధుపాళీ








