కన్నతల్లిని రోలురాయితో తలపై మోది హత్యచేసిన కసాయి కొడుకు మనస్థాపంతో అదే ఇంట్లో తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగెం శ్రీనివాస్ (42) ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించి హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌లో భార్య పద్మ ఇరువురు కుమారులు, ఒక కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. కొన్నేండ్ల క్రితం శ్రీనివాస్‌కు వెన్నుపూస ఆపరేషన్ కావడంతో డ్రైవర్ ఉద్యోగానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో భూమి కోసం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. కాగా, మూడురోజుల క్రితం మొహర్రం పండుగ నేపథ్యంలో శ్రీనివాస్ భార్యాపిల్లలతో పెద్దరావులపల్లికి వచ్చాడు. ఆదివారం మద్యం సేవించి భార్య పద్మతో గొడవపడి కర్రతో చితకబాదాడు.

ఆమెకు తలపై గాయాలు కావడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి అటునుంచి చికిత్స అనంతరం హైద్రాబాద్‌కు వెళ్లిపోయింది. అదే రాత్రి తల్లి సంగెం పోచమ్మతో గొడవపడి రోలు రాయితో తలపై మోది హతమార్చాడు. సోమవారం ఉదయం ఊరులోకి వెళ్లి మద్యం తెచ్చుకొని సేవించి తల్లిని హతమార్చిన గదిలోనే సీలింగ్ రాడ్‌కు తాను కూడా చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మధ్యాహ్నమైనా పోచమ్మ బయట కనిపించకపోవడంతో స్థానికులు తలుపులోనుంచి చూసి పోలీసులకు సమాచారం అందించారు. చౌటుప్పల్ డీసీపీ మధుసూదన్ రెడ్డి, రూరల్ సీఐ సతీష్ రెడ్డి, పోచంపల్లి ఎస్‌ఐ భాస్కర్ రెడ్డిలు ఘటనా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం భువనగిరి క్లూస్ టీం ఇంచార్జ్ హబీబ్ ఘటనాస్థలిలో ప్రమాద నమూనాలను సేకరించారు.