
ఆత్మహత్య చేసుకుంటానంటూ కొండ అంచున నిల్చున్న 18 ఏళ్ల కుమారుడిని కాపాడేందుకు తండ్రి చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. కుమారుడిని వెనక్కి లాగే క్రమంలో తండ్రి కూడా అదుపుతప్పి కొండపై నుంచి జారిపడగా.. కొద్దిసేపటికే తీవ్ర ఆందోళనకు గురైన తల్లి అక్కడి నుంచి దూకేసింది. ఈ ఘటనలో తల్లిదండ్రులతో పాటు కుమారుడు కూడా మృతి చెందారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖావ్డా కొండపైకి వెళ్లిన దేవ్‌లై ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఉదయం 10 గంటల సమయంలో కొండ అంచున నిల్చుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు మూడు గంటలపాటు గ్రామస్థులు, అతడి తల్లి అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తు గురించి, తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని పదేపదే కోరారు. అయినప్పటికీ యువకుడు తన నిర్ణయం మార్చుకోలేదు. “నేను దూకేస్తాను” అంటూ తల్లిదండ్రులను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ ఘటనను అక్కడికి వచ్చిన పర్యాటకులు, స్థానికులు వీడియోలో చిత్రీకరించారు.
చివరి 15-20 నిమిషాల్లో కుమారుడిని కాపాడేందుకు కింద నుంచి అతడిని బతిమాలుతున్న తండ్రి కొండపైకి ఎక్కారు. అంచుకు మరింత దగ్గరగా వెళ్తున్న కుమారుడిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించారు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కుమారుడిని పట్టుకునేందుకు తండ్రి ప్రయత్నించగా.. ఇద్దరూ అదుపుతప్పి కొండపై నుంచి కిందపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లి కూడా కొద్దిసేపటికే కొండపై నుంచి దూకేసింది. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.ఘటనాస్థలంలో పోలీసులు కూడా యువకుడిని వెనక్కి రావాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానిక ప్రత్యక్ష సాక్షి సంజయ్ జాదవ్ మాట్లాడుతూ.. యువకుడికి నచ్చజెప్పేందుకు తల్లిదండ్రులతో పాటు మరికొందరు పదేపదే ప్రయత్నించారని తెలిపారు. “తల్లిదండ్రులు, ఇతరులు అతడికి అర్థమయ్యేలా చెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ అతడు వారి మాట వినలేదు. కొండ అంచునే నిల్చున్నాడు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు” అని చెప్పారు. “తల్లి మాత్రం కొండపై నుంచి దూకవద్దంటూ పదేపదే వేడుకుంది” అని జాదవ్ తెలిపారు.











