
నూతన హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్
హైదరాబాద్ నుంచి రూ.20 ఛార్జి
త్వరలో రూ.౩౦౦ కోట్లతో విద్యుద్ధీకరణ
తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్రమంత్రులు
భక్తుల ఏండ్లతరబడి ఎదురుచూపులకు తెర
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/కొమురవెల్లి: ప్రసిద్ధ శైవక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి భక్తుల దశాబ్దాల కల సాకారమైంది. క్షేత్రానికి చేరుకునేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనం గా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసుకోవచ్చన్నారు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి సన్నిథిలో భక్తులకు అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు. ‘హైదరాబాద్ నుంచి కేవలం 20 రూపాయల ఛార్జీతో భక్తులు నేరుగా కొమురవెల్లికి చేరుకోవచ్చ’న్నారు.
ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ రైలు త్వరలోనే 300 కోట్లతో విద్యుద్ధీకరిస్తామన్నారు. స్టేషన్ నుంచి ఆలయం వరకు షటిల్ బస్సులు నడపాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి సిరిసిల్లకు, వచ్చే ఏడాది వేములవాడకు, 2029 నాటికి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ -యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మూడింటిని తెలంగాణకే కేటాయించినట్లు వెల్లడించారు. ఇవి రాష్ట్ర సమగ్ర వికాసానికి దోహదపడుతాయన్నారు. కాజీపేటలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
భక్తుల ఆకాంక్ష నెరవేరింది: బండి సంజయ్
కొమురవెల్లికి వచ్చే లక్షలాది మంది భక్తులు రైల్వేస్టేషన్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూశారని, మోదీ ప్రభుత్వం ఆ కోరికను నెరవేర్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వేలు, రింగ్ రోడ్లు సహా ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.1.84 లక్షల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఒక్క ఈ ఏడాదే రాష్ట్రానికి రూ.5,024 కోట్లు కేటాయించామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి చిత్తశుద్ధితో ఉన్నారని, కేంద్రంతో సహకరించే ప్రభుత్వాలకు అభివృద్ధి ఫలాలు వేగంగా అందుతాయని తెలిపారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పన వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మోదీ పాలనలో రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తవుతున్నాయని కొనియాడారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి క్షేత్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని, స్టేషన్ ప్రారంభంతో స్థానికంగా ఉపాధి, వ్యాపారావకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, డాక్టర్ కె.లక్ష్మణ్, ప్రజాప్రతిధులు, రైల్వే శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.











