మన తెలంగాణ/హైదరాబాద్: తమ పాలనలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. అయితే, ఆ తప్పులను కేవలం గుర్తించడమే కాకుండా, బాధ్యులైన వారి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నది కూడా తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అప్పట్లో టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీకైతే తమ పోలీసులే పట్టుకున్నారని, బయటవాళ్లెవరూ పట్టుకోలేదని చెప్పా రు. అయితే టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ వ్యవహారం లో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని అ న్నారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వా టిని సవరించుకుంటామని, కచ్చితంగా వచ్చే ఎ న్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకాశాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అలా జరగకుండా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల అన్నగా తాను బాధ్యత తీసుకుని తమ ప్రభుత్వం వచ్చాక యువత కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు.

బిఆర్‌ఎస్ హయాంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు దాదాపు 27 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తాము ఏనాడు గొప్పలు చెప్పుకోలేదని పేర్కొన్నారు. . 95 శాతం స్థానిక రిజర్వేషన్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ మాదిరిగా కల్లబొల్లి మాటలు కాకి లెక్కలు చెప్పలేదని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణలో కేవలం చందాలు దందాలు అనే కల్చర్ నడుస్తుందంటూ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రుజువు చేస్తే.. తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.

ఉద్యోగాలపై కాంగ్రెస్ నాయకులు కాకి లెక్కలు చెబుతూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు గోరీ కడతామని యువత ఒట్టు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని వెల్లడించారు. హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాలు అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ కంపెనీలను గుజరాత్‌కు గద్దల్లా తన్నుకుపోయారని ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు ఇప్పుడు ఓటేసినోడికి పోటు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని కెటిఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదికపైనే.. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు డెత్ డిక్లరేషన్ రాస్తుందని పేర్కొన్నారు. సరిగ్గా మూడేళ్ల క్రి తం ఏ సరూర్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందో, అదే వేదికపై ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత కాంగ్రెస్ మోసాలను గ్రహించిందని చె ప్పారు. మాట తప్పి, నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గడ్డపై నుంచి యువత డెత్ డిక్లరేషన్ రాయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.


నోటిఫికేషన్లు లేవు.. అంతా లూటీఫికేషన్లే

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీల పరిస్థితి ఏమైందని కెటిఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని అడిగారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు 4,000 నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థులు కొలువుల కోసం రోడ్లపైకి వస్తుంటే, ఈ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం పక్కనబెట్టి, కేవలం లూటీఫికేషన్‌లో మునిగిపోయిందని ఆరోపించారు. యువత ఉద్యోగాలు అడిగితే ‘ఎండ్రిన్ తాగి చావండి, బావిలో దూకండి’ అన్న రేవంత్ అహంకారానికి రాబోయే రోజుల్లో యువత ఘోరి కట్టడం ఖాయమని హెచ్చరించారు.

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క

కాంగ్రెస్ చేస్తున్న మోసాలను చూస్తూ కూడా తెలంగాణ మేధావులు మౌనంగా ఉండడం ఆవేదన కలిగిస్తోందని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు అక్రమాలు చేసినా నేపాల్ మాదిరి ఒక విధ్వంసానికి తాను పిలుపు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాస్వామికంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ వారి పైన పోరాటం చేయాలని మాత్రమే పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను కేసుల్లో ఇరికించి వారి భవిష్యత్‌ను దెబ్బతీసే పనులను బిఆర్‌ఎస్ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. యువతకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా, సోదరుడిగా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 2028లో ఖచ్చితంగా మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రాబోయే ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు న్యాయం చేసే బాధ్యత తనది అని భరోసా ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను అవమానించారు

గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ నుంచి మొదలుకొని డిఎస్‌సి వరకి అన్ని అంశాల్లో చెప్పిన మాటలు మరిచి నిరుద్యోగులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీస్తే నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులు, శంకినీలు అంటూ అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడారని కెటిఆర్ గుర్తు చేశారు.ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అహంకారపు మాటలను తెలంగాణ యువత మరిచిపోదని అన్నారు. రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అంటూ అడ్డగోలుగా మాట్లాడారని, సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. యువతకి కాంగ్రెస్ పైన పొట్టు పొట్టు కోపం ఉన్నదని.. ఓటు పెట్టుకొని మరి కాంగ్రెస్‌కి గోరీ కడతారని హెచ్చరించారు.

టి హబ్‌లో పుట్టిందే స్కైరూట్

తెలంగాణ టి హబ్‌లో పురుడు పోసుకున్న ‘స్కైరూట్’ కంపెనీ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా పంపిందని కెటిఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయిన తరుణంలో... దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఒక ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన ఘనత స్కైరూట్ కంపెనీకే దక్కుతుందని కొనియాడారు.