
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ‘చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం’ కింద కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా కొత్త పింఛన్లు మంజూరు కోరుతూ లక్షలాది దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 11 పింఛన్ల కేటగిరీల్లో 25,00,475 దరఖాస్తులు అందాయి. అయితే దరఖాస్తుదారులు ఈ దరఖాస్తులు సమగ్రంగా లేకపోవడం, వాటికి సరైన పత్రాలు జత చేయలేదు. దీంతో ప్రభుత్వం తాజాగా కొత్త చేయూత సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్సెల్ అనీమియా, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగుల కేటగిరీలో కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
అర్హులైన వారంతా ఈ నెల 8 శనివారం నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఎలాంటి చివరి తేదీని నిర్ణయించలేదు. కొత్త పింఛన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాన్ని చేయూత వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే స్వీకరిస్తారు. పోర్టల్‌లో ఉంచిన దరఖాస్తును ప్రింట్ తీసుకుని వాటిని మీ సేవా కేంద్రాలు, ఎంపీడీవో కార్యాలయాలు, మండల స మాఖ్యలు, మున్సిపల్ కార్యాలయాలు, వార్డు కా ర్యాలయాల్లో సమర్పిస్తే అక్కడ ఆ దరఖాస్తులను సి బ్బంది ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. పట్టణ ప్రాం తాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు లేదా పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను అందజేయాలి.
దరఖాస్తుల ప్రక్రియకు
నిర్ణయించిన కాలపరిమితి
చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రోసెస్ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులు స్వీకరించేందుకు రెండు వారాలు, దరఖాస్తుల పరిశీలనకు మరో రెండు వారాలు, అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆమోదానికి ఒక వారం కలిపి మొత్తంగా సుమారు 5 వారాల్లో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను పూర్తి చేసేలా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. దరఖాస్తులను పరిశీలించి, మంజూరు ప్రక్రియ పూర్తయ్యేందుకు సెప్టెంబర్ మూడో వారం అవుతుందని, అనంతరం అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పింఛన్లు లబ్దిదారులకు అందుతాయని అధికారలు చెబుతున్నారు.
దరఖాస్తుదారులకు ఉండాల్సిన అర్హతలవీ
చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వారికి పలు నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారునికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్నవారిని అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరిమితికి మించి ఆదాయం ఉన్న కుటుంబాలు పింఛన్‌కు అనర్హులు. అలాగే మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి, లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్నవారిని కూడా అర్హులుగా పరిగణించరు. కాగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా అనర్హులుగా గుర్తిస్తారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా పింఛన్లు పొందేందుకు అనర్హులని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టం చేసింది.








