మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(హిల్ట్) పాలసీపై సెప్టెంబర్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. 10 వేల ఎకరాలను ఎవరికో ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది సుమారు రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని పేర్కొన్నారు. ఈ పాలసీపై పారిశ్రామిక అసోసియేషనర్లకు లేఖలు రాస్తామని తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వ చ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా భూములను రెగ్యులరైజ్ చేయించుకునే వారికి భవిష్యత్తులో నష్టం తప్పదని హెచ్చరించారు. పారిశ్రామిక భూములను రియ ల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించ డం సరికాదన్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రజల వ్యక్తిగత ఆస్తులపై కూడా కన్నేశారని విమర్శించారు. నందినగర్ నివాసంలో కెటిఆర్ శనివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హిల్ట్ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రజల సొమ్మును  ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జేబులో వేసుకుంటుందో అందరికీ అర్థమయ్యేలా లేఖల రూపంలో, ప్రజెంటేషన్‌ల రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు.


దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజల విలువైన ఆస్తిని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములను భారీగా పెంచి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. 22ఎ పేరుతో లక్షల మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇచ్చే విధంగా వ్యవస్థను మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హిల్ట్ పాలసీ, 22ఎ, హైడ్రా వంటి అంశాలపై జరుగుతున్న అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ధరణి పేరు మార్చి దాని ద్వారా నిషేధిత జాబితాలో పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ చెప్పలేనన్ని భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కలిసి డబ్బులు పంచుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజల భూమిని చెరబట్టి ఇండ్లను కూలగొట్టి వారి ఆస్తులని అప్పనంగా మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు విద్వంసం సృష్టించారన్నారు.

హిట్లర్ తనకు ఆదర్శం అని చెప్పిన రేవంత్ రెడ్డి హిట్లర్ మాదిరే ప్రజల సొమ్మును, ఆస్తులను గుంజుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి గ్రేహౌండ్స్ భూములను, మూసి భూములను వదలకుండా హెరిటేజ్ రాక్స్ ఉన్న రాయదుర్గం భూములను సైతం వదిలిపెట్టడం లేదన్నారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన భూ కుంభకోణాలను 22ఎ పేరిట జరుగుతున్న భూదోపిడిని, హిల్ట్ పాలసీ స్కామ్‌ని అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. గతంలో తాను చెప్పినట్లుగానే టిడిఆర్ హక్కులను అప్పనంగా కొని తర్వాత తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి పదుల రెట్లు అధిక ధరకి ఇప్పుడు బలవంతంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయల స్కామ్‌కి తెరలేపారని ఆరోపించారు. ఒకప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ భూములను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. నో బిఆర్‌ఎస్, నో ఎల్‌ఆర్‌ఎస్ అంటూ ఎన్నికలలో హామీ ఇచ్చి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారన్నారు.


హరీష్ రావు గుడికి వెళితే తప్పా..?

క్షుద్రపూజలు అంటూ కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నదని కెటిఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని అన్నారు. తాము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళం అని, తమకు క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాదిరిగా తమకు క్షుద్ర రాజకీయావు తెలియదని అన్నారు. హరీష్ రావు గుడికి వెళితే తప్పా..? అని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదని చెప్పారు. నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే

కాంగ్రెస్ సంస్కృతి తమది కాదని అన్నారు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. తాము ఏ సబ్ స్టేషన్‌కైనా రావడానికి సిద్ధం అని, 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుణ యాగాలు సహా పలు అంశాలపై స్పందిస్తూ.. యాగాలు చేయొచ్చు కానీ.. ప్రభుత్వం కూడా తన బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పారు. దైవకృపకు మానవ ప్రయత్నం కూడా ఉంటేనే ఫలితం వస్తుంది. వ్యవసాయం, రైతుల పట్ల సిఎం రేవంత్ రెడ్డికి పట్టింపు, అవగాహన లేవు అని ఆరోపించారు. పాలమూరు బిడ్డగా చెప్పుకొనే ఆయన.. ఆ జిల్లాకు సాగునీరు ఇవ్వట్లేదని అన్నారు.రైతులకు అవసరమైన సమయంలో పంపులు ఆన్ చేయడం, సాగునీటి ప్రణాళికలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.పక్క రాష్ట్రం నీటిని ఎత్తుకుపోతుంటే ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ హక్కులను ఎలా కాపాడతారో ప్రజలకు చెప్పాలి

నది జలాల విషయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగితే జల ఉద్యమం చేపడతామని కెటిఆర్ హెచ్చరించారు. నది జలాల హక్కుల కంటే ముఖ్యమైనది మరొకటి లేదని స్పష్టం చేశారు. వచ్చే వారం జరగనున్న జీఆర్‌ఎంబీ సమావేశ ఎజెండాను ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఎజెండా పూర్తిగా తెలంగాణ హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ హక్కులను ఎలా కాపాడతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తోందని, అందుకే నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా నియమించడం కాంగ్రెస్ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.

హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలు సిఎం వైఫల్యానికి నిదర్శనం

హైడ్రా వ్యవహారంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఫల్యానికి నిదర్శనమని కెటిఆర్ పేర్కొన్నారు. కోర్టుల సూచనలను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షలాది మందికి పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.