
హైదరాబాద్: జెన్‌జీపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జనరేషన్ ప్రతి దానికి లాజిక్ అడుగుతోందని, యువకులుగా ఉన్నప్పుడు మాకున్న విధేయత ఈ జరేషన్‌కు లేదన్నారు. విశ్వ మాంగళ్య సభలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వం, జ్ఞాన వ్యవస్థలపై విశ్వాసం ఉంచాలని భగవత్ పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, సామాజిక వ్యవస్థలను బలోపేతం చేయడం సమాజానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. తాము చిన్నగా ఉన్నప్పుడు పెద్దల మాటలను పాటించేవాళ్లమని ఇప్పుడు తరం అలా లేదన్నారు. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, తల్లిదండ్రలు వారికి వివరించాలని, పిల్లలను తిట్టడమో, ఆజ్ఞాపించడమో చేయకుండా వారితో మాట్లాడాలని సూచించారు. దేవుళ్లకు కోతి, ఏనుగు ముఖాలు ఎందుకు ఉన్నాయని పిల్లలు అడుగుతున్నారని, ఎందుకు ఉన్నాయో చాలా మంది తల్లిదండ్రులకు తెలియదని, అందుకే ఇలాంటి జ్ఞానం పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని మోహన్ భగవత్ సలహా ఇచ్చారు. కొత్త తరంతో ఎక్కువ సేపు సలహాలు ఇవ్వాలని, ఆదేశాలు జారీ చేయవద్దని, మనం వారితో కలిసి ఉన్నామని భావన కల్పించాలన్నారు. మాతృత్వం లేకుండా జీవ సృష్టి, పోషణ అసాధ్యమని, మానవ నాగరికతకు మాతృత్వమే పునాది అని భగవత్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు మాతృత్వం ఎంతో గొప్పగా చెప్పారని గుర్తు చేశారు.











