మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) సీఈవో మార్క్ జుకన్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి, చైల్డ్సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ (సీఎస్‌ఏఎం), ప్లాట్‌ఫామ్ నిర్వహణలో పొరపాట్లను అంగీకరించిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మెటా ప్రతినిధులు తమ నిర్వహణలో జరిగిన తప్పులను అంగీకరించి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపాయి.ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (మెయిటీ) అధికారులు, మెటా గ్లోబల్ నాయకత్వం మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో సోషల్ మీడియా వేదికల బాధ్యత, కంటెంట్ నియంత్రణ, భారత చట్టాల అమలుపై విసృ్తతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాలల భద్రతను కాపాడే బాధ్యత సోషల్ మీడియా సంస్థలపైనా ఉందని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. బాలలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ ద్వారా ప్రకటనల ఆదాయం పొందుతూ, మరోవైపు సమాచార సాంకేతిక చట్టంలోని ‘సేఫ్ హార్బర్’ రక్షణ కోరడం సమంజసం కాదని కేంద్రం మెటాకు తేల్చి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం మధ్యవర్తి (ఇంటర్మీడియరీ) సంస్థలకు ‘సేఫ్ హార్బర్’ రక్షణ లభిస్తుంది. అయితే మెటా అల్గారిథమ్‌లు ఏ కంటెంట్‌ను ఎవరికి చూపించాలో స్వయంగా నిర్ణయిస్తున్నందున, ఆ సంస్థను సాధారణ మధ్యవర్తిగా పరిగణించలేమని కేంద్రం అభిప్రాయపడినట్లు సమాచారం. అందువల్ల ఆ చట్టం కింద లభించే రక్షణ మెటాకు వర్తించదని అధికారులు స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. కొన్ని రకాల కంటెంట్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేసి ప్రాధాన్యం కల్పించిన విషయాన్ని మెటా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాంటి నిర్ణయాలపై సంస్థ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. హానికర కంటెంట్‌ను సమర్థంగా నియంత్రించడంలో లోపాలు జరిగినట్లు కూడా మెటా అంగీకరించినట్లు పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ నుంచి తాత్కాలికంగా తొలగించిన ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటు సమాచార సాంకేతిక స్థాయి సంఘం ఛైర్మన్ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. మెటా ప్రతినిధులతో మూడు గంటలకు పైగా జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ వీడియో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఐదు గంటలపాటు అందుబాటులో లేకపోయిందని మెటా ప్రతినిధులు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీకి సంబంధించిన ‘జెన్ జెడ్’ అవుట్‌రీచ్ వీడియోను తాత్కాలికంగా తొలగించడం, బాలలపై లైంగిక దుర్వినియోగ కంటెంట్‌ను సమర్థంగా అరికట్టడంలో వైఫల్యం, ప్రభుత్వ ఆదేశాల అమలులో లోపాలు వంటి అంశాలపై మెటా అధికారులతో కేంద్రం 45 నిమిషాలపాటు సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభ్యంతరకర కంటెంట్ నియంత్రణపై కూడా ఈ సమావేశంలో విసృ్తతంగా చర్చ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.