
క్షణాల్లో వచ్చిన వరద కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా..తండ్రి చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ తన కళ్ల ముందే భార్య, ఇద్దరు పిల్లలు వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఎస్ యూవీ కారు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యవత్మాల్ జిల్లాలోని దర్వా తాలూకా దహేలి గ్రామం సమీపంలో కుప్తి (పదన్) నదిపై ఉన్న వంతెనను దాటేందుకు ఒక కుటుంబం తమ కారులో ప్రయాణించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంతెనపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చీకటి కారణంగా నీటి తీవ్రతను అంచనా వేయలేక డ్రైవ్ చేయడంతో కారు వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ముగ్గురు మృతి: ఈ ప్రమాదంలో లోని గ్రామానికి చెందిన మాధవి ఖాందారే (42), ఆమె కుమార్తెలు సాచి (17), ప్రాచి (11) వరద నీటిలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించారు. జూలై 31 (శుక్రవారం) మధ్యాహ్నం కారుతో పాటు వారి మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు: కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో భర్త అవినాష్ ఖాందారే ఎలాగోలా కారులోంచి బయటకు రాగలిగారు. ప్రవాహంలో కొట్టుకుపోతూ మధ్యలో ఉన్న ఒక చెట్టును గట్టిగా పట్టుకుని రాత్రంతా అక్కడే ఉండిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున విపత్తు నిర్వహణ బృందాలు ఆయనను సురక్షితంగా రక్షించాయి.











