
నేను, నా సాహితీ యాత్ర: 25 పుట్టిపెరిగింది చదువుకున్నది అంతా పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్‌పూర్లో. సాహిత్యాభిమాని, సభలు సమావేశాలేవీ వదలని మా తాతయ్య దుర్గయ్య నాయుడుకు బాల్యం నుండి చేతికర్రగా తిరిగిన ఫలితం, బహుశా నాకున్న ఈ కొద్దిపాటి సాహిత్యానుబంధం. నేను చదువు కుంటున్న క్రమంలో నాకు దొరికిన గురువులు స్నేహితులు బంధువులు నాకు సాహిత్య మార్గాన్ని చూపించారు. అప్పట్లో పాఠశాలల్లో ప్రతీ ఏడాదీ ఒక వార్షిక పత్రిక వెలువడేది. అందులో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఏదో ఒకటి రాసే వారు. కొందరు గురువుల సూచనలు సలహాలు విద్యార్దుల లోని వారికే తెలియని మరో కోణాల్ని వారు ఆవిష్కరించుకో గలిగేవారు. అలా నాకు ఒక సంస్కృత ఉపాధ్యాయుడు మంకాల శ్రీపతి గారి మూలంగా రాయడం, ఇతర ఆసక్తికర పుస్తకాలను చదువుకోవడం ఒక అభిరుచిగా మారింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. నేను చదువుకున్న ఖరగపూర్‌లోని ఆంధ్రా ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే, తెలుగు ఒక పాఠ్యపుస్తకంగా ఉండేది. ఆ తరువాత అంతా ఆంగ్ల బోధనలోనే నా చదువు కొనసాగింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కాలేజీ రోజుల్లో కథలు రాయటం ఒక సరదాగా ఉండేది. ఆ తరువాత పై చదువులు, ఉద్యోగం, సంసారంలో పడి సరదాలన్నింటినీ దాదాపు మర్చిపోయాననే చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా హైదరాబాద్ చేరాక, అనేకమంది కవులతోను, సాహిత్యకారులతోను పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారకా హోటల్ లోని శివారెడ్డిగా రు, వారి మిత్ర బృందం. అలాగే నెలనెలా వెన్నెల సాహిత్య సమావేశాలు నిర్వహించే సి.వి.కృష్ణారావు గారితో పరిచయంతో, ఆ సమావేశాలకు నెలనెలా వెళ్లి రావటం మూలా న కవిత్వం వైపు నా మనస్సు మళ్లింది.
ఈలోగా మా పెద్దమ్మాయి పెళ్లి జరిగింది. ఆమెను అత్తారింటికి పంపిస్తున్న క్రమంలో నేను అనుభవించిన బాధని, నా అనుభవాలుగా రాసి ఉంచుకున్నది, మా పక్క వీధిలో ఉన్న చేకూరి రామారావు గారికి చూపించాను. ఆయన అందులో ఉన్న పదాలతోనే దానికి ‘వలసపోయిన మందహాసం‘ అని పేరుపెట్టి, అంధ్రప్రభ ఆదివారం అనుబంధానికి దానిని పంపించమని సూచించారు. ఆంధ్రప్రభకు పంపించిన రెండు వారాల్లోనే, అందమైన బొమ్మతో వారు దానిని ప్రచురించారు. నాకు మొట్టమొదటి సారిగా ఆ కవిత కొచ్చిన అభినందనల మూలంగా, నేనూ కవితలు రాయొచ్చన్న ధైర్యం వచ్చింది. ఆ కవిత మీద చేరాగారు చేరాతల్లో రాసాక, నా ఉత్సాహం మరింత రెట్టింపయింది. దాని దరిమిలా కవిత్వం పట్ల వ్యామోహం శ్రద్ధ నాకు పెరిగాయి.
మొదట్లో కవిత్వానికే పరిమితమయి తరువాత మరో ఎనిమిది కవిత్వ సంకలనాలు - మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా, నాకు తెలియని నేనెవరో, నిశ్శబ్దం నీడల్లో, విడనిముడి, ఆకాశయానం, రాత్రి నదిలో ఒంటరిగా, రాత్రి వీస్తున్న గాలి - వచ్చాయి. ఈ లోగా నేను బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నపుడు, వివిధ దేశాలకు వెళ్లి వస్తుండేవాడిని. న్యూయార్క్ లో ఉండగా, అక్కడి లైబ్రరీ, లైబ్రరీ లాంటి మిత్రుడు తమ్మినేని యదుకుల భూషణ్ మూలంగా నేను అనువాదంలోకి పడ్దాను. మధ్య మధ్య కవిత్వానికి దూరం కాకపోయి, నా అనువాద రచనలే పదిహేను వరకూ వచ్చాయి.
అందులో ప్రపంచవ్యాప్తంగా పంచభూతాలలానే కవిత్వం కూడా అనిపించి ఆ పేర్లతోనే వచ్చిన - అదే ఆకాశం, అదే గాలి, అదే నేల, అదే కాంతి, అదే నీరు - పుస్తకాలతో పాటు - శతాబ్దాల సూఫీ కవిత్వం, 1901 నుంచి నోబెల్ కవిత్వం, పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు చర్యాపదాలు, అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరాల మియా కవిత్వం, బెంగాలీ బౌల్ కవిత్వం, సమకాలీన టిబెట్ కవిత్వం ప్రవాసంలో ప్రతిఘటన లాంటివి - వచ్చాయి. కవిత్వానికి అనువాదాలకే పరిమితం కాకుండా, కథలు, అనువాదాలు అనుభవాలు, ఆసక్తి పేరున అభిరుచి వ్యాసాలు వచ్చాయి. ఇటీవల నా మూలాలను తెలుసుకునే క్రమంలో చేసిన పరిశోధన ఫలితంగా చరిత్ర పరంగాఅగమ్య గమ్యాలు వచ్చింది. ఇవి కాక కన్నడంలో నా కవితల అనువాదం వలసహోద మందహాస, ఆంగ్లంలో The Smile That Migrated and Other Poems, Alone in the Night River - పుస్తకాలు వచ్చాయి.
తెలుగు విశ్వవిద్యాలయం నుండి కవిత్వానికి కీర్తి పురస్కారం, అనువాదానికి సాహితీ పురస్కారాలతో పాటు, అదే నేల గ్రంథానికి తాపీ ధర్మారావు పురస్కారం, అజో విభో కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం - లాంటివి నాకు దొరికిన పురస్కారాల్లో కొన్ని. ముకుంద రామారావు సాహిత్యం ఒక పరిశీలన అంశం మీద బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి నారగోని సైదులు ఇటీవలే పిహెచ్.డి పట్టా పొందారు. చదివిన కవుల కవిత్వాలనుండి నేర్చుకున్నదీ ఉంది, నేర్చుకోవల్సిందీ ఉంది. బయటపడే వరకూ లోలోపల జరిగే రహస్యప్రక్రియ లాంటి కవిత్వాన్ని నలుగురితో పంచుకోవాలనే తహతహా నాకు ఎప్పుడూ ఉంటుంది.ఎంత చదివినా, ఎంత చూసినా, ఎంత తెలిసినా, ఎంత ఎదిగినా ఎంత తక్కువో అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఆగిపోనీకుండా నాతో రాయిస్తున్నది కూడా అదే బహుశా. సృజనలో చిన్నా పెద్దా, కొత్తా పాతల తేడాలు నాకు కపడవు. పుట్టుకమీద ప్రేమమీద చావుమీద ఉన్న నమ్మకమే నాకు కవిత్వం మీద కూడా.దేశం యేదైనా జాతి యేదైనా కవిత్వ భాష విశ్వజనీనమనీ, కవి వసుధైక కుటుంబీకుడనీ నా ప్రగాఢ నమ్మకం

- ముకుంద రామారావు











