సిఎం రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె వ్యాఖ్యలను తప్పుపట్టిన ఖర్గే

ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని చెప్పినట్లు సమాచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొండా కుటుంబానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య నడుస్తున్న రాజకీయ వివాదంలో భాగంగా ఆదివారం మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో ఆదివారం బెంగుళూరులో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆమె మల్లిఖార్జున ఖర్గేకు వివరణ ఇచ్చారు. దాదాపు అరగంటకుపైగా సాగిన సమావేశంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల వివాదంపై ఖర్గెకు వివరించారు. సిఎం రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టినట్లు తెలిసింది.

అలా మాట్లాడటం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నదని, ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని చెప్పినట్లు సమాచారం. తనకు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ అందరూ తనను ఏకాకిని చేసి దాడిచేస్తున్నట్లు మంత్రి వాపోయినట్లు తెలిసింది. కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని సురేఖ చెప్పినప్పటికీ, కమిటీ దానితో ఏకీభవించలేదని వివరణ ఇచ్చినట్ల సమాచారం. అయితే, ఈ వ్యవహారం తన వద్దకు రాలేదని, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యల తర్వాత చూద్దామని కొండా సురేఖకు మల్లిఖార్జున ఖర్గే చెప్పినట్లు తెలిసింది.