
మన తెలంగాణ/హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉందని అధికారులు తెలిపారు. అలాగే రుతుపవన ద్రోణి కూడా వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం మీదుగా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగింది.
ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు.
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో రాగల 48 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే వారంలోనూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని, ఆగస్టు 24, 25 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లోనూ, ఆగస్టు 26 నుంచి 29 వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.








