విపక్షాల ఆందోళనల నడుమ ప్రవేశపెట్టిన మంత్రి జితేంద్రసింగ్

దోషులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా

విద్యార్థులపై దాడులను నిరసిస్తూ బిల్లుపై చర్చను అడ్డుకున్న విపక్షాలు

నేడు చర్చ... ఓటింగ్?

ఉభయ సభల్లో వెనక్కి తగ్గని విపక్షం

పార్లమెంట్ నేటికి వాయిదా

విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి : కిరెన్ రిజజు

న్యూఢిల్లీ : విపక్షాల ఆందోళనల నడుమ సోమవారంనాడు పేపర్ లీకుల వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షల చట్ట సవరణ బిల్లు2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. తాజా సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీక్‌లకు పాల్పడే అక్రమార్కులకు జైలుశిక్ష గరిష్టంగా పదేళ్లు, జరిమానా రూ.10 కోట్లు విధిస్తారు. ఇకపై పేపర్ లీక్ అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దర్యాప్తు చేపడుతుంది. ఈ కేసుల్లో విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేసు నమోదైన రెండు నెలల్లో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజులు గడువు ఉంటుంది. అప్పీల్‌పై కూడా 90 రోజుల్లో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసుకునే అధికారం కల్పిస్తారు. చార్జిషీట్ దాఖలైన మూడు నెలల కాలంలో విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు పేపర్ లీక్ దోషులకు గరిష్టంగా 3- నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది. నీట్ ఆందోళనలనలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దాని ప్రకారమే తాజా సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లుపై మంగళవారంనాడు చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం ఓటింగ్ చేపడతారు.

ఉభయ సభల్లో వెనక్కి తగ్గని విపక్షాలు..

మరోవైపు పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సోమవారంనాడు కూడా విపక్షాల ఆందోళనల నడము ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ చర్చకు నోచుకోలేదు. స్పీకర్ ఓంబిర్లా విపక్షాలకు పదేపదే విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయింది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, పెల్లెట్‌గన్స్ ప్రయోగాన్ని నిరసిస్తూ విపక్షాలు నిరంతరాయంగా సభకు ఆటంకం కలిగించడమే కాకుండా బిల్లుపై చర్చను అడ్డుకున్నారు. హోంమంత్రి అమిత్ షా సమాధానంతో పాటు అదే అంశంపై చర్చకు పట్టుబట్టారు. సభ ఆర్డర్‌లో లేకపోవడంతో పలు మార్లు స్పీకర్ సభను వాయిదా వేశారు.

బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సాయంత్రం 5గంటలకు చర్చ ప్రారంభమవుతుందని ప్రకటించారు. విపక్షాలు, అధికార పక్షాన్ని మొత్తం మూడు గంటల సమయం కేటాయించారు. సభ తిరిగి ఐదు గంటలకు ప్రారంభం కావడం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు మాట్లాడుతూ అధికార, విపక్షాలు చర్చకు సిద్ధంగా ఉన్నాయని, కానీ కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల మాత్రమే చర్చకు ఆటంకం కల్పిస్తున్నాయని ఆరోపించారు. పేపర్ లీక్ బిల్లు చర్చకు రాకుండా కావాలనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ ఓంబిర్లా సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే ధోరణి కనిపించింది. ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా విపక్షం వెనక్కి తగ్గలేదు. దీంతో ఎగువ సభను కూడా డిప్యూటీ చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు.