
వైద్యులకు చేతులు జోడించి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వినతి
ఐసియులో ఉన్న సుదర్శన్‌రెడ్డికి చూసి భావోద్వేగానికి గురైన కెసిఆర్
యశోద ఆస్పత్రికి వెళ్లి సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన ప్రతిపక్ష నేత
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. తీవ్ర గుండెపోటుతో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసియు వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ఐసియులో ఉన్న సుదర్శన్‌రెడ్డిని చూసి కెసిఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు అరగంట సేపు అక్కడే ఉండి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని, అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని వైద్యులు కెసిఆర్‌కు వివరించారు. ఆయన అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని, మెదడు పనితీరు సాధారణ స్థితికి రావలసి ఉందని, దీనిపై స్పష్టత రావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
కాగా..ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు. ఐసియులో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం అనంతరం కెసిఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు... భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లె స్వాతి తదితరులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కెసిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కెసిఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...“ మీరేం చేస్తారో చేయండి..కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ వైద్యులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్‌ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని యశోద ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి భరోసా ఇచ్చారు. కెసిఆర్ వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్,పద్మారావు గౌడ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, వినోద్ కుమార్, ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క, కెటిఆర్ సహా పలువురి నేతల పరామర్శ
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందించిన చికిత్స వివరాలను డాక్టర్లు కెటిఆర్‌కు వివరించారు. అన్ని రకాల మెరుగైన చికిత్స అందించాలని కెటిఆర్ ప్రత్యేకంగా డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. పెద్ది కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
కాగా, మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం హన్మకొండలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సిపిఆర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారని తెలిసిందే.











