
హైదరాబాద్: మాజీ గవర్నర్ డీవై పాటిల్(90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం కోల్లాపూర్ లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన పూర్తిపేరు జ్ఞానదేవ్ యశ్వంతరావ్ పాటిల్. విద్యావేత్త, వితరణశీలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన 1957లో కొల్హాపూర్ పురపాలక ఎన్నికలలో కౌన్సిలర్ గా విజయం సాధించారు. 1960, 1970లలో పన్హాలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. 1983లో ఆయన డి. వై. పాటిల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్ ను స్థాపించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నాలుగు దశాబ్దాలలో నవీ ముంబై, పూణే, కొల్హాపూర్‌లలో 180కి పైగా విద్యాసంస్థలు, అనేక డీమ్డ్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. వైద్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం, బయోటెక్నాలజీ, మేనేజ్‌మెంట్ రంగాలలో కాలేజీలు స్థాపించారు. భారతదేశంలో కొద్దిమంది ప్రైవేట్ విద్యావేత్తలు మాత్రమే ఆ స్థాయిలో సంస్థలను నిర్మించారు, రాజ్యాంగ పదవిలో ఉంటూనే అలా చేసిన వారు ఇంకా తక్కువ.
పాటిల్ 2009 నుండి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా పనిచేశారు, 2013లో బీహార్‌కు మారారు. 2014 మధ్యలో కొద్దికాలం పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో గవర్నర్ పదవులు సాధారణంగా విధానపరమైన క్రియాశీలతకు గుర్తుండిపోవు, కానీ పాటిల్ తన పదవీకాలాన్ని ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ విద్య అందుబాటులోకి తీసుకరావడానికి ఉపయోగించుకున్నారు. ఆయన రాజ్‌భవన్‌లో ఉన్నా లేదా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నాప్రజల కోసమే పని చేసేవారు. ఆయన సామాజిక సేవకు గాను 1991లో పద్మశ్రీ లభించింది.











