
ఎగువ అసోంలో ఇటీవల సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలు అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి మరో నిదర్శనంగా నిలిచాయి. ఈ వరదలతో ఎగువ అసోం, దిగువ అసోం, మేఘాలయ మధ్య కీలక రవాణా మార్గాలు తెగిపోయాయి. ఈ వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది, దాని ఉధృత ఉపనదులు గట్లను దాటి ప్రవహించడంతో ప్రధాన రహదారులు, వంతెనలు నీటమునిగాయి. గువాహటి వంటి ప్రధాన నగరాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అయితే ఈ విపత్తును ‘క్లౌడ్ బరస్ట్’గా అంటే అనివార్యమైన ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ విపత్తును కేవలం ప్రకృతి సృష్టించిన ప్రమాదంగా పేర్కొనడం అసలు కారణాలను కప్పిపుచ్చడమే అవుతోంది.
భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిన విధానాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను క్రమంగా బలహీనపరచడం వంటి మానవ చర్యలే ఎగువ అసోంలో ఈ భారీ వరదలకు ప్రధాన కారణాలుగా మారాయి. శివసాగర్, చరైదేవో, జోర్హాట్ జిల్లాల్లో సంభవించిన తీవ్ర నష్టం కూడా ఈ విధానాల ఫలితమే. కొండలు, లోయలతో కూడిన అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను సహజ సంపదగా కాకుండా వాణిజ్య లాభనష్టాల కోణం లో చూడటమే ఈ పరిస్థితికి దారితీసింది. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లలో నదులపై ఇప్పటికే వందకు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, మరెన్నో ప్రణాళిక దశలో ఉన్నాయి.
వర్షాకాలంలో జలాశయాలు నిండిపోతే, తమ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఎగువ ప్రాంతాల నిర్వాహకులు ఎలాంటి సమన్వయం లేకుండానే భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతమైన ఎగువ అసోం కృత్రిమ ఆకస్మిక వరదలకు నిలయంగా మారుతోంది. దీనికి తోడు నియంత్రణ లేకుండా సాగుతున్న బొగ్గు తవ్వకాలు, అక్రమంగా కొండలను తొలగించడం, భారీ స్థాయిలో రాతి క్వారీల నిర్వహణవల్ల లక్షల టన్నుల మట్టి నదుల్లోకి చేరుతోంది. దిఖౌ, దిసాంగ్, ఝాంజీ వంటి నదులు మట్టితో నిండిపోవడంతో వాటి నీటిని మోసుకెళ్లే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా భారీ వర్షాలు కురిసిన వెంటనే ఈ నదులు గట్లను దాటి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం సృష్టించిన బీభత్సం మానవ, ఆర్థిక నష్టాల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎఎస్‌డిఎంఎ) గణాంకాల ప్రకారం, భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి విడుదలైన నీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. పది లక్షలకు పైగా ప్రజలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. 21,523 హెక్టార్లకు పైగా నిలువ పంటలు నీటమునిగాయి. 11 వేలకుపైగా పశువులు, కోళ్లు మృతి చెందడంతో గ్రామీణ కుటుంబాలు తమ ప్రధాన జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఈ ‘మానవ సృష్టి వరదల’ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలంటే ఈశాన్య భారతంలో గతంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే సరిపోతుంది. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌ఇఇపిసిఒ) నిర్వహిస్తున్న 405 మెగావాట్ల రంగనది జలవిద్యుత్ ప్రాజెక్టు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రంగనది జలాశయం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అదనపు నీటిని ఒక్కసారిగా విడుదల చేయడం వల్ల అసోంలోని లఖింపూర్, ధేమాజీ జిల్లాలు తరచూ వరదల బారిన పడుతున్నాయి. గ్రామాలు కొట్టుకుపోవడంతోపాటు సారవంతమైన వ్యవసాయ భూములు మందపాటి ఇసుక పొరలతో కప్పుకుపోయి సాగుకు పనికిరాకుండా మారుతున్నాయి.
హిమాలయ ప్రాంత నదుల వ్యవస్థ ఎంత సున్నితమైనదో సిక్కింలోని చుంగ్‌థాంగ్ వద్ద తీస్తా 3 ఆనకట్ట కొట్టుకుపోయిన ఘటన మరోసారి చాటిచెప్పింది. హిమ సరస్సు విరిగిపోవడంతో ఏర్పడిన ఆకస్మిక వరద ధాటికి ఈ భారీ ఆనకట్ట క్షణాల్లోనే కొట్టుకుపోయింది. అనంతరం ఉధృతంగా వచ్చిన వరద నీరు సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని అనేక పట్టణాలను ముంచెత్తింది. డజన్ల కొద్దీ వంతెనలు ధ్వంసమయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎగువ ప్రాంతాల్లో చేపట్టే భారీ ప్రాజెక్టులు భౌగోళిక ప్రమాదాలను విస్మరిస్తే, దాని మూల్యం దిగువ ప్రాంతాల ప్రజలే ప్రాణాలతో, ఆస్తులతో చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని ఈ విపత్తు స్పష్టం చేసింది. అసోంలోని వరదలు, మహారాష్ట్రలోని భివండిలో భవనాలు కూలిపోవడం, ముంబైలో చెట్లు కూలి ప్రాణనష్టం సంభవించడం వంటి ఘటనలన్నింటికీ ఒకే తరహా పాలనా వైఫల్యం కనిపిస్తోంది. ప్రజల భద్రత కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇటువంటి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి.
గత పదేళ్లలో పర్యావరణ చట్టాలను పెద్ద వ్యాపార సంస్థలకు అనుకూలంగా మార్చడం ద్వారా కఠిన నియంత్రణ వ్యవస్థలను నామమాత్రంగా మార్చేశారు. ముఖ్యంగా పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ) నోటిఫికేషన్ వ్యవస్థను క్రమంగా బలహీనపరచడం వల్ల ప్రకృతి పరిరక్షణకు ఉన్న కీలక అడ్డుకట్టలు తొలగిపోయాయి. వివాదాస్పద సవరణల ద్వారా ప్రభుత్వం‘ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్’ (పనులు పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతి) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండానే జలవిద్యుత్, గనులు, పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్మించి నిర్వహించే అవకాశాన్ని కంపెనీలు పొందుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినా తర్వాత స్వల్ప జరిమానా చెల్లించి అక్రమ నిర్మాణాలను చట్టబద్ధం చేసుకునే వెసులుబాటు కల్పించారు.
దీంతో పర్యావరణ పరిరక్షణ స్థానంలో ‘డబ్బు చెల్లించి కాలుష్యం సృష్టించే’ విధానం అమలవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భాగస్వామ్యాన్ని కూడా క్రమంగా బలహీనపరిచారు. భారీ ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగా ఇవ్వాల్సిన గడువును 30 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించారు. దీంతో ముఖ్యంగా ఆదివాసీ, మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక వివరాలను పూర్తిగా పరిశీలించి తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం తగ్గిపోయింది. అంతేకాకుండా అనేక భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం ‘వ్యూహాత్మక ప్రాజెక్టులు’ గా ప్రకటించే వెసులుబాటు కల్పించడంతో, వాటిపై ప్రజా పర్యవేక్షణ, పారదర్శకత, ప్రజాస్వామ్య పరిశీలనకు తావు లేకుండా పోతోంది.
తాజాగా ప్రతిపాదించిన సవరణల ప్రకారం, ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారులతో ప్రత్యేక శాశ్వత కమిటీలను ఏర్పాటు చేసి, స్వతంత్ర నిపుణుల కమిటీల (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీలు ఇఎసిలు) పాత్రను పక్కనపెట్టి కార్పొరేట్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే విధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈశాన్య భారత భౌగోళిక పరిస్థితులు దక్కన్ పీఠభూమి, దక్షిణ భారత తీర ప్రాంతాలతో పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ, పాలనా వైఫల్యాల తీరు మాత్రం దేశవ్యాప్తం ఒకేలా కనిపిస్తోంది. అసోంలో మానవ తప్పిదాల వల్ల సంభవించిన వరదలకు దక్షిణ భారత నగరాల్లో చోటుచేసుకున్న పట్టణ విపత్తులు అద్దం పడుతున్నాయి. కార్పొరేట్‌రాజకీయ వ్యవస్థల కుమ్మక్కు, పరిపాలనా నిర్లక్ష్యం దేశమంతటా ఒకే విధంగా కొనసాగుతున్నాయనే విషయాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో ప్రతి వర్షాకాలంలో ఐటి కారిడార్లు, నివాస కాలనీలు జలమయం కావడానికి ప్రధాన కారణం నగరంలోని చారిత్రక గొలుసు చెరువుల (చైన్ ఆఫ్ లేక్స్) వ్యవస్థను క్రమంగా ధ్వంసం చేయడమే. రియల్ ఎస్టేట్ ఒత్తిళ్లతో వేలాది సహజ చెరువులు, వాటి నీటి ప్రవాహ మార్గాలైన నాలాలను కాంక్రీటీకరించడంతో వర్షపు నీరు వెళ్లే మార్గాలే లేకుండా పోయాయి. గువాహటిలోని దీపోర్ బీల్ చిత్తడి ప్రాంతం నాశనమైన తీరు కూడా ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఉత్తర భారతంలో కార్పొరేట్ మద్దతుతో నిర్మించే భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులైనా, దక్షిణ భారతంలో రియల్ ఎస్టేట్ ఆధారిత ఆక్రమణలైనా సహజ జలవ్యవస్థను గౌరవించడంలో ప్రభుత్వాలు విఫలమైతే ఫలితం ఒక్కటే. నష్టాలు మాత్రం ప్రజలపై పడుతుండగా, లాభాలు ప్రైవేటు సంస్థలకే పరిమితమవుతున్నాయి. ప్రకృతిని కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకునే వనరుగా భావిస్తూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని మార్చాలంటే దేశ అభివృద్ధి నమూనాలోనే మౌలిక మార్పులు అవసరం.
అందులో భాగంగా ముందుగా, పనులు పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రద్దు చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణకు గతంలో అమల్లో ఉన్న 30 రోజుల గడువును పునరుద్ధరించాలి. స్థానిక ప్రాంతాల్లో చేపట్టే భారీ ప్రాజెక్టుల విషయంలో అక్కడి ప్రజలకు నిర్ణయాత్మక హక్కు కల్పించాలి. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన, భూకంప ముప్పు అధికంగా ఉన్న హిమాలయ, ఈశాన్య ప్రాంతాల్లో కొత్త భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై తక్షణమే నిషేధం విధించాలి. వాటికి బదులుగా నదుల సహజ ప్రవాహానికి భంగం కలిగించని సూక్ష్మ జలవిద్యుత్ ప్రాజెక్టులు, రన్ ఆఫ్ ది రివర్ సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఎగువ రాష్ట్రాలు, అక్కడ పనిచేస్తున్న విద్యుత్ సంస్థలు దిగువ ప్రాంతాల్లో సంభవించే వరద నష్టాలకు చట్టపరంగా, ఆర్థికపరంగా బాధ్యత వహించేలా స్వతంత్ర నదీ పరీవాహక ప్రాంత ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
అలాగే గువాహటి, హైదరాబాద్ వంటి నగరాల్లో మిగిలి ఉన్న చెరువులు, చిత్తడి నేలలు, సహజ నీటి నిల్వ ప్రాంతాలను రక్షిత ఆస్తులుగా గుర్తించి సంరక్షించాలి. వరద మైదానాలు, సున్నితమైన కొండ ప్రాంతాల్లో వాణిజ్య నిర్మాణాలను పూర్తిగా నిషేధించే కఠిన జోనింగ్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎగువ అసోంలో సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలు ఒక చేదు వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ప్రకృతిని డబ్బుతోనో, అధికారంతోనో ప్రభావితం చేయడం సాధ్యం కాదు. సహజ సమతుల్యతకు విరుద్ధంగా తీసుకునే ప్రతి నిర్ణయానికి మూల్యం చెల్లించక తప్పదు. కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధానాలను పక్కనపెట్టి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కఠినమైన జవాబుదారీతనంతో కూడిన పాలనను అవలంబించకపోతే, భారత అభివృద్ధి గాథ ఇలాంటి నివారించగలిగే మానవ విషాదాల బురదలో, శిథిలాల మధ్యే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి విధానాలే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించే శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయి.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)











