మన తెలంగాణ/హైదరాబాద్‌ః జెన్-జీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం కాదు, మంత్రి పదవి ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. జెన్-జీలకు (21-30 ఏళ్ళ వయసు) ఉన్న వారు చట్ట సభలో అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పడంపై కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత జెన్-జీలకు మంత్రి పదవి ఇచ్చి ఆచరణలో చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఎంఎల్‌ఎసిలను రాజీనామా చేయించి జెన్-జీ లకు ఆ పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమరి వద్ద హోం, విద్యా, మున్సిపల్ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలను జెన్-జీలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ దృష్టిలో జెన్-జీలంటే విహెచ్, కెకె, కోదండ రెడ్డి అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటాలో పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటే కదా అని అన్నారు.

దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్ , పర్సన్ లాస్ట్

తమ పార్టీకి దేశం ప్రథమమని, ఆ తర్వాతే పార్టీ అని, చివరగా వ్యక్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆ కోణంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన చెప్పారు.