
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) చేసిన విజ్ఞప్తిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ స్పందించారు. మధ్యాహ్న భోజన విరామంలోగా సమస్య పరిష్కారం కాకపోతే తానే నేరుగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు.
గురువారం ఉదయం విచారణ ప్రారంభంలోనే ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌తో పాటు ఇతర స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. కనీసం వీరికి పరిమిత ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు హాజరు కాలేకపోయిన సందర్భాల్లో వారి గైర్హాజరును మాత్రమే కారణంగా చూపి ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయరాదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
వికాస్ సింగ్ ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కూడా సూచించారు. సుప్రీంకోర్టు ప్రవేశ అనుమతి పాస్‌లు, ప్రాక్సిమిటీ కార్డులు లేదా అధికారిక గుర్తింపు కార్డులు కలిగిన న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల అనంతరం సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లో దిగేందుకు అనుమతించాలని కోరారు. మిగిలిన ప్రయాణికులను తదుపరి రైలులో వెళ్లేలా సూచించవచ్చని తెలిపారు.
దీనిపై స్పందించిన సీజేఐ, ఈ ప్రతిపాదనపై ఢిల్లీ మెట్రో అధికారులతో చర్చించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు పరిపాలనకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ఉదయమే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాను. వారు ఢిల్లీ మెట్రో అధికారులతో చర్చిస్తున్నారు. ఇది పరిష్కార మార్గాల్లో ఒకటిగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామంలోగా సమస్య పరిష్కారమైతే మంచిదే. లేకపోతే నా జోక్యం అవసరమైతే తప్పకుండా జోక్యం చేసుకుంటాను అని సీజేఐ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.











